Spy Network: భారత నేవీలో గూఢచర్యం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేశ నేవీ, రక్షణ సంస్థల రహస్యాలను శత్రువుకి చేరవేసిన వైనం అలజడి సృష్టిస్తోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ గూఢచర్యం కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ స్పై నెట్ వర్క్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆపరేషన్ ఫైర్ వాల్ 2026 పేరుతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా భారీ కుట్రను బహిర్గతం చేసింది. శత్రువు చేతికి దేశ నేవీ, రక్షణ రహస్యాలను చేరవేస్తున్న ముఠాను వెలుగులోకి తెచ్చింది.
విశాఖ కేంద్రంగా భారీ కుట్ర
పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వెలుగులోకి తెచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా 18మంది అనుమానితులను గుర్తించింది. వీరిలో 13మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విశాఖ కేంద్రంగా సాగిన గూఢచర్యం వ్యవహారం 10 రాష్ట్రాలకు విస్తరించినట్లు దర్యాఫ్తులో తెలుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు మరికొందరి ప్రమేయంపై నిఘా పెట్టారు. ఒకరిని విశాఖ జైలుకి, మరొకరిని విజయవాడ జైలుకి తరలించారు.
18మంది అనుమానితుల్లో 13మంది నేవీ సిబ్బంది
ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కు చెందిన 12 ప్రత్యేక బృందాలు ఈ నెల 1వ తేదీన ఆంధప్రదేశ్, కేరళం, మహారాష్ట్ర, కర్నాటక సహా దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో 18మందితో కూడిన పాకిస్తాన్ స్పై నెట్ వర్క్ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారణలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తో భారత నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బయటకు వచ్చాయి. భారత నావికా దళం, వివిధ రక్షణ సంస్థల కీలక సమాచారమే లక్ష్యంగా ఈ గూఢచర్యం సాగినట్లుగా అధికారులు తెలిపారు.
ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా రక్షణ రహస్యాలు చేరవేత
అనుమానితులంతా అత్యంత రక్షణ కలిగిన ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరంతా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో నేరుగా టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల సమయంలో అనుమానితుల నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, ల్యాప్ టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అరెస్ట్
గూఢచర్యంకు సంబంధించి విశాఖలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ సాయి వర ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై అతడిని కోయంబత్తూరు నుంచి విజయవాడ జైలుకి తరలించారు. మిగతా 16 మంది అనుమానితులపై దర్యాఫ్తు కొనసాగుతోంది. జాతీయ భద్రత దృష్టా కీలక వివరాలను అధికారులు వెల్లడించలేదు.












