ఏపీ

Stone Attack: రాత్రి అయితే చాలు ఇళ్లపై రాళ్ల దాడులు.. అప్పాజీపేటలో భయంభయం

రచన: NK•••5 నిమిషాల పఠనం

అనంతపురము జిల్లా పామిడి మండలం అప్పాజీపేట గ్రామంలో చిత్రవిచిత్రమైన ఘటన జరుగుతోంది. రాత్రి అయితే చాలు గ్రామస్తుల ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని రాళ్లు ఇళ్లపై వర్షంలా కురుస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు కాదు.. వారం రోజులుగా ఇదే పరిస్థితి.

Stone Attack: అనంతపురము జిల్లా పామిడి మండలం అప్పాజీపేట గ్రామంలో అంతుచిక్కని వింత జరుగుతోంది. రాత్రి అయితే చాలు గ్రామస్తుల ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతున్నాయి. రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని రాళ్లు ఇళ్లపై వర్షంలా కురుస్తున్నాయి.

ఒకటి, రెండు రోజులు కాదు.. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఇళ్లపై రాళ్ల మోతతో గ్రామస్తులు భయం భయంగా గడుపుతున్నారు. వారికి కంటి మీద కనుకు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని వాపోతున్నారు. అసలు ఎక్కడి నుంచి రాళ్లు వస్తున్నాయో తెలియక అయోమయం చెందుతున్నారు. ఇది ఆకతాయిల పనేమోనని భావించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు గస్తీ ఉన్న సమయంలోనూ రాళ్ల వర్షం

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంతుచిక్కని మిస్టరీని చేధించాలని పోలీసులు ప్రయత్నించారు. నలుగురు కానిస్టేబుళ్లు గ్రామంలో 2 రాత్రులు గస్తీ కాశారు. పోలీసులు గస్తీ ఉన్న సమయంలోనూ సేమ్ సీన్ కనిపించింది. రాత్రి పూట ఇళ్లపై రాళ్ల వర్షం కురిసింది. దీంతో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి 20 మంది యువకులు పోలీసులతో కలిసి సమీపంలోని కొండపైకి వెళ్లి కాపలా కాశారు. సరిగ్గా అదే సమయంలో గ్రామంలోని ఇళ్లపై రాళ్లు పడ్డాయి. దీంతో గ్రామస్తులు, పోలీసులు నివ్వెరపోయారు.

ఆకతాయిల పనేనా?

పోలీసులు సైతం ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదంటున్నారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఎవరైనా ఆకతాయిలు రాళ్లను ఇళ్లపైకి విసురుతున్నారా? లేక గాలిలో నుంచి వస్తున్నాయా? అన్నది అంతుచిక్కడం లేదు. ఈ సమస్యతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే దీన్ని పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

అతీత శక్తుల పనే అంటూ ప్రచారం

''గత వారం రోజుల నుంచి గ్రామంలో ఇదే తంతు. రాత్రి 7 గంటల నుంచి ఇళ్లపై రాళ్లు పడటం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. కంటిన్యూగా రాళ్లు పడవు. అరగంట గ్యాప్ తీసుకుని పడతాయి. పోలీసులు వచ్చి విచారణ జరిపినా సమస్య పరిష్కారం కాలేదు'' అని గ్రామస్తులు తెలిపారు. కాగా, ఇది మనుషుల పనే అని కొందరు అనుమానిస్తుండగా.. ఏదో కీడు జరుగుతోందని మరికొందరు శంకిస్తున్నారు. ఇది అతీత శక్తుల పనే ప్రచారమూ జరుగుతోంది.

మిస్టరీని ఛేదించాలని గ్రామస్తుల విన్నపం

ఏది ఏమైనా చీకటి పడితే చాలు అప్పాజీపేట ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడమే మానేశారు. రాత్రి అవగానే ఇళ్లలోకి వెళ్లిపోయి తలుపులు మూసుకుంటున్నారు. ఎప్పుడు ఏ రాయి ఎటువైపు నుంచి వచ్చి పడుతుందోనని కంగారు పడుతున్నారు. స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి పహారా కాస్తున్నా రాళ్ల దాడులు ఆగకపోవడం మిస్టరీగా మారింది.

గ్రామంలో చాలావరకు ఇళ్లు రేకుల షెడ్లు. ఈ రాళ్ల దాడిలో అవి దెబ్బతింటున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులకు స్వల్పగాయాలు కూడా అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాళ్ల దాడి ఘటనపై దర్యాఫ్తు జరిపి వాస్తవాలను తేల్చాలని, రాళ్ల వర్షం నుంచి తమను కాపాడాలని అప్పాజీపేట గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నారు.

#Stone Attack#Stones#Houses#Anantapur#Pamidi#Appajipeta#Stones Attack#Stone Throwing#Mystery#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి