Power Bills: విద్యుత్ ఛార్జీల మోతపై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఓవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో.. మరోవైపు కరవుతో సామాన్య ప్రజలు కుదేలయ్యారని వాపోయారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి వారిపై మరింత భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు హరీశ్ రావు.
కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆనాడు టీడీపీకి ప్రజలు షాకిచ్చారు
అప్పట్లో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా బషీర్ బాగ్ లో ఉద్యమం చేశామని గుర్తు చేశారాయన. కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆనాడు టీడీపీకి ప్రజలు షాకిచ్చారని తెలిపారు. అప్పట్లో ఆంధ్రా పాలకులు అర్థరాత్రి వేళ విద్యుత్ ఇచ్చి రైతుల ఉసురుపోసుకున్నారని చెప్పారు. ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు.
కరోనా, ఎల్ నినో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం డేంజర్
కరోనా, ఎల్ నినో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం డేంజర్ అని హరీశ్ రావు అన్నారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. మూడేళ్లలోనే విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. మోటార్లు నడపకుండా కాంగ్రెస్ సర్కార్ కృతిమ కరవు తెచ్చిందన్నారు.
కాంగ్రెస్ వచ్చాక కరెంటుకు కరోనా పట్టింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క సబ్ స్టేషన్ కూడా కట్టలేదన్నారు. కేసీఆర్ నిర్మించిన వాటిపైనే మూడేళ్ల నుంచి ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక కరెంటుకు కరోనా పట్టిందన్న హరీశ్ రావు.. మన థర్మల్ ప్లాంట్ ను రాజస్థాన్ కు కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బేషరతుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కరెంటు కోతలు
''కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలోనే మళ్లీ కరెంటు కోతలు వచ్చాయి. రాష్ట్రంలో కరెంటు లేక, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. అవకాశం ఉండి కూడి పంటలకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదు. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యమే. రేవంత్ సర్కార్ పాలనలో కరెంటుకు కరోనా పట్టినట్లు అయ్యింది.
విద్యుత్ సమస్యల నుండే తెలంగాణ పుట్టింది
''విద్యుత్ సమస్యల నుండే తెలంగాణ పుట్టింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతుంది. నాడు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది. రేవంత్ సర్కార్ పాలనలో అందుకు భిన్నంగా జరుగుతోంది.
పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమమే
రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి దిగజారుతోంది. రైతులకు కరెంటు కోతలు, ప్రజలకు వాతలు. ఇప్పటికే కరవు, ఎల్ నినో, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అది చాలదన్నట్లుగా వారి నడ్డి విరిచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రజలపై రూ.5,420 కోట్ల అదనపు విద్యుత్ భారాన్ని మోపాలని ప్రభుత్వం చూస్తోంది. మేము ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ ను సూటిగా అడుగుతున్నాం. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. కరవు, ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలపై అదనపు భారం మోపద్దు'' అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీశ్ రావు.


