Ramappa Temple: కాకతీయ శిల్పకళా వైభవానికి మకుటంలా నిలిచి, అంతర్జాతీయ వేదికపై తెలుగు ఖ్యాతిని రెపరెపలాడించిన రామప్ప గుడికి ఊహించని పిడుగులాంటి వార్త తగిలింది. ఎనిమిది శతాబ్దాలుగా ఎన్నో భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్ర సృష్టించిన ఈ మహాద్భుత కట్టడంపై ఇప్పుడు సింగరేణి డైనమైట్లు గురిపెట్టాయి.
ములుగు జిల్లా వెంకటాపూర్‌లో సింగరేణి తలపెట్టిన భారీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు.. పక్కనే ఉన్న చారిత్రక రామప్ప చెరువును పగలగొట్టి, ఆ నీటితో రామప్ప గుడి ఉనికినే శాశ్వతంగా కనుమరుగు చేయబోతోందా అనే భయం ఇప్పుడు యావత్ తెలంగాణను వణికిస్తోంది.
వెయ్యి అడుగుల గొయ్యి..
ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న 1088 ఎకరాల్లో 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీనికోసం ఏకంగా 300 మీటర్ల లోతు.. అంటే సుమారు 1000 అడుగులు, దాదాపు 100 అంతస్తుల భవనం లోతుకు భూమిని తవ్వేసేందుకు సింగరేణి రెడీ అయ్యింది. ఇంతటి లోతు నుంచి బొగ్గును బయటకు తీయాలంటే భూగర్భంలో విచ్చలవిడిగా హై-ఇంటెన్సిటీ పేలుళ్లు జరపాలి.
ఇప్పటికే 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపురం ఓపెన్ కాస్ట్‌లో పేలుళ్లు జరిగితేనే పాలంపేటలోని ఇళ్లు, రామప్ప రాతి స్తంభాలు వణికిపోతున్నాయి. అలాంటిది కేవలం 5 కిలోమీటర్ల దూరంలో నిత్యం బాంబులు పేలిస్తే ఆ ప్రాంతంలో కృత్రిమ భూకంపాలు రావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాటి కారణంగా యునెస్కో గర్భగుడి నిలువునా చీలడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.
3 టీఎంసీల నీటి బాంబు..
ఈ వివాదంలో అత్యంత భయంకరమైన కోణం రామప్ప చెరువు. 2.97 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ఈ చెరువు మట్టికట్టతో నిర్మితమైంది. దీనికి లీకేజీలను ఆపే ‘కట్ ఆఫ్ ట్రెంచ్’ గోడ లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం చెరువు కింద నుంచి రెండు భారీ భూగర్భ పగుళ్లు వెళ్తున్నాయి. అందులో ఒకటి నేరుగా సింగరేణి తవ్వబోయే ఓపెన్ కాస్ట్ వైపునకు విస్తరించి ఉంది.
300 మీటర్ల లోతుకు గుంత తవ్వినప్పుడు ఏర్పడే విపరీతమైన హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల చెరువులోని 3 టీఎంసీల నీరు భూగర్భ పగుళ్ల ద్వారా అగాధంలోకి వేగంగా దూసుకుపోతుంది. ఈ ఒత్తిడికి చెరువు కట్ట కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బొంగలు పడతాయి. దీంతో మట్టికట్ట ఒక్కసారిగా పేకమేడలా కూలిపోతుంది.
ఆలయాన్ని కాపాడే ‘శాండ్‌బాక్స్’ పునాదుల్లోకి నీరు వెళ్తే, ఆ ఇసుక పట్టు తప్పి గర్భగుడి కుంగిపోయి కుప్పకూలిపోతుందని అంటున్నారు. కట్ట తెగితే 3 టీఎంసీల నీళ్లు సునామీలా విరుచుకుపడి.. 24 గ్రామాలు, 30 వేల ఎకరాల పంటపొలాలతో పాటు శతాబ్దాల రామప్ప గుడిని నిలువునా ముంచెత్తి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టే ప్రమాదం ఉందని ఎన్‌ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు.
భరోసా ఏది?
మరోవైపు సింగరేణి యాజమాన్యం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మైనింగ్ జరిగేది ఆలయానికి వ్యతిరేక దిశలోనేనని, 5 కిలోమీటర్ల దూరం ఉన్న కారణంగా ఆలయానికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. నిపుణుల కమిటీ రిపోర్టులు, కలెక్టర్ ఎన్‌వోసీ, న్యూఢిల్లీ ఏఎస్‌ఐ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు స్టార్ట్ చేస్తామని సమర్థించుకుంటోంది.
అయితే గతంలో దేవాదుల సొరంగం పనుల్లో బ్లాస్టింగ్లు జరిపితేనే రామప్పకు ముప్పు అని ఎన్‌జీఆర్‌ఐ హెచ్చరించడంతో అప్పటి పాలకులు అలైన్‌మెంట్‌ను మార్చారు. మరి అంతకంటే పదిరెట్లు విధ్వంసకరమైన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును ఎలా అనుమతిస్తారని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రశ్నిస్తోంది.
కనుమరుగైతే చరిత్ర క్షమిస్తుందా?
దశాబ్దాల పరిశోధనలు, పోరాటాల ఫలితంగా 2021లో ప్రపంచ పటంలో నిలిచిన యునెస్కో హోదా.. ఈ మైనింగ్ దురాశ వల్ల రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒకవైపు న్యాయపోరాటానికి హెరిటేజ్ ట్రస్ట్ సిద్ధమవుతుండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బొగ్గు తవ్వకాల కోసం వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు.. కానీ ఒక్కసారి 800 ఏళ్ల రామప్ప ఆలయం నీటిపాలైతే మళ్లీ ఆ వైభవాన్ని తెచ్చుకోగలమా? అభివృద్ధి పేరుతో వారసత్వాన్ని బలిపెట్టే ఈ సింగరేణి ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలి.
లేదంటే కాకతీయుల ఇంజినీరింగ్ అద్భుతం జలసమాధి అయిన పాపం పాలకులను చరిత్ర ఉన్నంతకాలం వెంటాడుతూనే ఉంటుంది.


