ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ గంటలు పనిచేయడం కంటే పని నాణ్యత, ఏకాగ్రతలే అత్యంత ముఖ్యమని ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన 18వ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అంతరాయాలు, సమావేశాలు, విరామాలు లేకుండా పూర్తి ఏకాగ్రత, క్రమశిక్షణతో రోజుకు 4 గంటలు పనిచేస్తే ఉత్తమ ఉత్పాదకత సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఆఫీసులో ఉద్యోగి ఎన్ని గంటలు గడిపారనే దానికంటే ఎంత నాణ్యమైన పని పూర్తి చేశారనేదే ప్రధానమని చేతన్ భగత్ పేర్కొన్నారు. గతంలో మనుషులు గంటల కొద్దీ చేసే పనులను ఇప్పుడు AI టెక్నాలజీ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి పనిచేయాల్సిన అవసరం లేదని తెలిపారు. రోజులో చేయాల్సిన పనులకు ప్రాధాన్యత (Prioritization) ఇస్తూ, అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థంగా వాడుకోవడమే విజయానికి సూత్రమని ఆయన విశ్లేషించారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి గతంలో భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ప్రతిపాదించిన అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. నారాయణమూర్తి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా చేతన్ భగత్ స్పందిస్తూ, ఎక్కువ గంటలు కష్టపడటం కంటే మానసిక ప్రశాంతత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, వ్యక్తిగత సంతోషంపై దృష్టి పెట్టడం అవసరమని హితవు పలికారు.
తన ‘11 రూల్స్ ఫర్ లైఫ్’ (11 Rules for Life) పుస్తకంలోని సూత్రాలను ప్రస్తావిస్తూ, జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతీ ఒక్కరికీ స్పష్టత ఉండాలని ఆయన కోరారు. AI వేగంగా ఉద్యోగ స్వరూపాన్ని మారుస్తున్న ప్రస్తుత తరుణంలో, పని ఒత్తిడిని తగ్గించుకుని నాణ్యమైన ఫలితాలను సాధించడంపై చేతన్ భగత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.












