తెలంగాణ

తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కలకలం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల డిస్మిస్!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రభుత్వ కొలువులు సాధించి ఏళ్లుగా చలామణి అవుతున్న విషయం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎట్టకేలకు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. పీజీ నకిలీ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా చెలామణి అవుతున్న 35మందిని ఇంటర్మీడియట్ విద్యా మండలి విధుల నుంచి తొలగిస్తూ (డిస్మిస్) సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

  • రంగంలోకి ఇంటర్మీడియట్ విద్యా మండలి

  • విచారణలో వెలుగుచూసిన బాగోతం

  • పీజీ నకిలీ పత్రాలతో క్రమబద్ధీకరణ..

  • మరో 320 మంది సర్టిఫికెట్ల పరిశీలన!

 నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రభుత్వ కొలువులు సాధించి ఏళ్లుగా చలామణి అవుతున్న విషయం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎట్టకేలకు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. పీజీ నకిలీ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా చెలామణి అవుతున్న 35మందిని ఇంటర్మీడియట్ విద్యా మండలి విధుల నుంచి తొలగిస్తూ (డిస్మిస్) సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వీరి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా, అనంతరం చేపట్టిన పత్రాల సమగ్ర పరిశీలనలోనే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది.

 వర్సిటీల వెరిఫికేషన్‌లో తేలిన అక్రమాలు

సర్వీస్ క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ తదితర పీజీ సర్టిఫికెట్లపై అనుమానం రావడంతో అధికారులు వాటిని సంబంధిత విశ్వవిద్యాలయాలకు పంపించారు. ఆ నివేదికల్లో అవన్నీ నకిలీ పత్రాలని స్పష్టమవడంతో, సదరు లెక్చరర్లకు షో-కాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న అనంతరమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన లెక్చరర్లు ఈ తొలగించబడిన వారిలో ఉన్నట్లు సమాచారం.

 మరో 320మంది జాబితా.. విజిలెన్స్ విచారణకు డిమాండ్

గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో 10మందిని తప్పించగా, ప్రస్తుతం మరో 320మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు పరిశీలన దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ స్కామ్‌పై సీబీ-సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. నకిలీ పత్రాలను ధ్రువీకరించిన అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది.

 ఈ వ్యవహారం కేవలం కొందరు ఉద్యోగులకే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లను విక్రయించిన ముఠాలు, వాటిని ప్రోత్సహించిన అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అర్హులైన నిరుద్యోగులకు సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. మొత్తం విద్యా వ్యవస్థలో విశ్వసనీయతను నిలబెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు కోరుతున్నారు.రాబోయే రోజుల్లో రిక్రూట్‌మెంట్, రెగ్యులరైజేషన్ ప్రక్రియల్లో ఆధునిక డిజిటల్ వెరిఫికేషన్ విధానాలను తీసుకొస్తే తప్ప ఇలాంటి అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టడం సాధ్యపడదని సలహా ఇస్తున్నారు.  

#FakeCertificatesScam#TelanganaJuniorLecturers#ContractLecturersDismissed#IntermediateEducationTelangana#CBCIDProbe#TelanganaNews#EducationalScam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి