దేశరాజధాని ఢిల్లీలో ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టగా.. రాహుల్, ప్రియాంకగాంధీలు,ఇతర ఇండియా ఎంపీలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలోనే సీఈసీకి వ్యతిరేకంగా ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలోనే పోలీసు బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రాహుల్ గాంధీ నిరసన తెలిపారు.
పలువురు ఎంపీలు సైతం బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ‘ఇండియా’ కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు ఎంపీలు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో ఈసీ కార్యాలయం పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్పీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం నిరసన ప్రాంతానికి చేరుకుని విపక్షాల నిరసనకు మద్దతు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.‘జ్ఞానేశ్ కుమార్.. ఆట ముగిసింది బ్రో.. ఇక రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ సెటైర్లు వేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తోందన్నారు.
ఎన్నికల పారదర్శకతను తుంగలో తొక్కిన జ్ఞానేశ్ కుమార్‌కు ఆ కుర్చీలో కొనసాగే నైతిక హక్కు లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఈసీ వైదొలిగేంత వరకు దేశవ్యాప్తంగా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. అక్టోబర్ 8 వరకు జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు, ఆందోళనలు కొనసాగిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు. విపక్ష ఎంపీల ధర్నాతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా భద్రతా బలగాలను మోహరించింది.మరోవైపు సీజేపీ సైతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.


