బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రిశాంక్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సికింద్రాబాద్ కోర్టుకు తరలించారు. అయితే, మన్నె క్రిశాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్ రెడ్డి కుటుంబం చేసిన రూ.50వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం మీద ప్రెస్‌మీట్ పెడితే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించడంతో పాటు వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కోర్టు వద్దకు భారీ ఎత్తున నాయకులు,కార్యకర్తలు చేరుకుంటున్నారు.అయితే, గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. ‘నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేకే అరెస్ట్ చేశారు.
‘మెడికవర్, మాక్స్ బీఎన్ కంపెనీ’ల్లో డైరెక్టర్లుగా ఉన్నవారే రేవంత్ రెడ్డి కూతురు కడుతున్న స్కూళ్లలోనూ డైరెక్టర్లుగా ఉన్నారని ఆధారాలు బయటపెట్టి ప్రశ్నించాను.రేవంత్ రెడ్డి సోదరుడి టెసెరాక్ట్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి ఎలా ఇచ్చారని ప్రశ్నించాను.
మూడు రోజులు గడుస్తున్నా రేవంత్ రెడ్డి కుటుంబం నుండి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు. వీటిపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే నన్ను అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టినందుకు అరెస్ట్ చేయడం దేశంలో ఇదే మొదటి సారి.మెడికవర్ ఆసుపత్రి, మాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీ, మైండ్ వాల్ట్ కార్పొరేట్ ఈ సంస్థలతో రేవంత్ రెడ్డి కూతురికి, అల్లుడికి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మాణం చేస్తే దాన్ని ఇవాళ్టి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ మూడు మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్స్ చేసి రూ.13 వేల కోట్లకు అమ్మేశారు.
గురుకుల పాఠశాలలు పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి కూతురు మాత్రం కార్పొరేట్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నారు.కేవలం ప్రశ్నించినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఇదేం మాకు కొత్త కాదు, ఇప్పటికే రెండు సార్లు జైలులో వేశారు, ఇళ్ల తలుపులు పగలగొట్టారు, పిల్లలను భయపెట్టారు’ అని మన్నె క్రిశాంక్ వ్యాఖ్యానించారు.


