Current Bill Hike: ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల ప్రచారాలతో ఊదరగొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు తెలియకుండానే వెనుక గుమ్మం నుంచి భారీ కరెంట్ షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందా? సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై ఏకంగా రూ.5,420 కోట్ల పిడుగు పడబోతోందా? అంటే అందుతున్న సంకేతాలు ‘అవుననే’ స్పష్టం చేస్తున్నాయి.
గతంలో వాడిన విద్యుత్‌కు సంబంధించి లెక్కలు సరిచేయాలంటూ డిస్కంలు తెరపైకి తెచ్చిన ‘ట్రూ అప్’ బాదుడుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) పచ్చజెండా ఊపడంతో, వచ్చే నవంబర్ నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటా కరెంట్ బిల్లుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండున్నరేళ్ల పాటు షాక్ తప్పదు..
ఈ భారం ఏదో ఒకటి, రెండు నెలలు ఉండి సర్దుకుంటుందంటే పొరపాటే. ప్రజల జేబులను ఏళ్ల తరబడి ఖాళీ చేసేలా ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను రెడీ చేశారు. వచ్చే నవంబర్ నుంచి జారీ చేసే బిల్లుల్లో ప్రతి యూనిట్‌పై 30 పైసల ఎక్స్‌ట్రా ఛార్జ్ పడనుంది. ఇక డిసెంబర్ నుంచి ఏకంగా యూనిట్‌కు 50 పైసలకు పెంచనున్నారు. దక్షిణ డిస్కం (TGSPDCL) పరిధిలో ఏకంగా 29 నెలల పాటు, ఉత్తర డిస్కం (TGNPDCL) పరిధిలో 26 నెలల పాటు ఈ ఎక్స్‌ట్రా బాదుడు నిర్విరామంగా కొనసాగనుంది.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నెలకు సగటున 200 నుంచి 300 యూనిట్లు యూజ్ చేస్తే, తాజాగా పెరిగిన ఎక్స్‌ట్రా బాడుతో ప్రతినెలా రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. చిరు వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలకు ఈ భారం తడిసి మోపెడయ్యే ప్రమాదం ఉంది.
అసలు ఈ రూ.7,635 కోట్ల మాయాజాలం ఏంటి?
డిస్కంల నిర్వహణ లోపాలు, అంచనాలు తప్పిన విద్యుత్ కొనుగోళ్ల నష్టాన్ని నేరుగా ప్రజల నెత్తిన రుద్దడమే ఈ ట్రూ అప్ వెనుక ఉన్న అసలు రహస్యం అని విశ్లేషకులు చెబుతున్నారు. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ అప్ సర్దుబాటు అవసరమని ఈఆర్‌సీ తేల్చింది.
వ్యవసాయ రంగానికి తేలిన రూ.2,214.99 కోట్లను ఉచిత విద్యుత్ విధానం దృష్ట్యా రైతుల నుంచి కాకుండా, ప్రభుత్వం నుంచే సబ్సిడీ రూపంలో డిస్కంలు రాబట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మిగిలిన సింహభాగం అంటే రూ.5,420.23 కోట్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచే పిండుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందులోనూ హైదరాబాద్‌తో కూడిన దక్షిణ తెలంగాణ ప్రజలపైనే ఏకంగా రూ.4,222.93 కోట్ల అత్యధిక భారం పడనుంది.
బిల్లుపై ప్రత్యేకంగా ‘ట్రూ అప్’ ముద్ర
గతంలోలా గుట్టుచప్పుడు కాకుండా కట్ చేయడానికి బదులుగా, ఈసారి వినియోగదారుల బిల్లులపై ‘ట్రూ అప్ చార్జీలు’ అని ప్రత్యేక కాలమ్‌లోనే ఈ అదనపు మొత్తాన్ని నమోదు చేసి ఇవ్వాలని ఈఆర్‌సీ ఆదేశించింది. దీంతో తాము నిత్యం వినియోగించే కరెంట్‌కు ఎంత కడుతున్నాం, గత బకాయిల పేరిట సంస్థలు ఎంత అదనంగా గుంజుతున్నాయో ప్రజలకు కళ్లారా స్పష్టంగా కనిపించనుంది.
ఓవైపు నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడికి.. ఈ ట్రూ అప్ వడ్డన కోలుకోలేని దెబ్బే. సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో ఇచ్చి, ఇలా ఎక్స్‌ట్రా ఛార్జీలతో మరో చేత్తో వెనక్కి లాక్కుంటున్నారన్న విమర్శలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.


