తెలంగాణ

Telangana: ట్రబుల్ షూటర్ హరీషు.. నీ గిల్లుడు తక్కువేం కాదు!.. మామకు తగ్గ అల్లుడు.. బావకు తగ్గ బావమరిదివే!!..

రచన: Venu•••10 నిమిషాల పఠనం

తెలంగాణ ఉద్యమ నాయకుడి నుంచి ఊహించని సిరిసంపదల దాకా ఎదిగిన హరీష్ రావు.. బీఆర్‌ఎస్ పార్టీలో బలమైన నేతగా రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు.

తెలంగాణ ఉద్యమ నాయకుడి నుంచి ఊహించని సిరిసంపదల దాకా ఎదిగిన హరీష్ రావు.. బీఆర్‌ఎస్ పార్టీలో బలమైన నేతగా రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా కల్వ కుంట్ల కుటుంబ ఆస్తులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అక్రమ సంపాదనలో మామకు తగ్గ అల్లుడు.. బావకు తగ్గ బావమరిది అంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని మళ్లీ చర్చనీయాంశం చేశాయి.

ఉద్యమంలో కాళ్ళకు రబ్బర్ చెప్పులు.. నేడు విలాసవంతమైన జీవితం

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాళ్ళకు రబ్బర్ చెప్పులతో సిద్దిపేట వేదికగా పోరాడిన రోజుల్లో హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ చాలా ప్రత్యేకం.. ఆ సమయంలో ఆయనలో ఉన్న నిరాడంబరత, ప్రజలతో సులభంగా కలిసిపోయే తత్వం, నిరంతరం ఉద్యమాల్లో రగిలే మనస్తత్వం ప్రజలకు దగ్గర చేశాయి. ఆనాడు రాష్ట్ర సాధనే శ్వాస.. ప్రజల శ్రేయస్సే ధ్యేయం అని పలికిన హరీష్ రావు.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన పూర్తయ్యేసరికి పూర్తిగా లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు.

అఫిడవిట్ లెక్కలు - సోషల్ మీడియా వైరల్ కథనాలు

ఎన్నికల సమయంలో హరీష్ రావు సమర్పించిన అధికారిక అఫిడవిట్లను, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక 2009 నాటి అఫిడవిట్ ప్రకారం హరీష్ రావు మొత్తం ఆస్తుల విలువ సుమారు 71.29 లక్షలు. ఇందులో చరాస్తులు 41.09 లక్షలు కాగా, స్థిరాస్తులు 30.20 లక్షలుగా ఉన్నాయని పేర్కొన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

అదేవిధంగా 2014 నాటికి ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 2.96 కోట్లు.. 2018 ఎన్నికల సమయానికి హరీష్ రావు.. ఆయన భార్య ఆస్తుల విలువ కలిపి సుమారు 11.44 కోట్లకు చేరిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు 3.90 కోట్లుగా ప్రకటించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల ప్రకారం, ఆయన మొత్తం ఆస్తుల విలువ 24.29 కోట్లకు పెరిగింది.

ఇందులో చరాస్తులు దాదాపు 14.09 కోట్లు కాగా, స్థిరాస్తులు 10.20 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు 11.50 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు చూపించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR India) మరియు MyNeta విశ్లేషణల ప్రకారం, 2009 నుండి 2023 వరకు గల 14 ఏళ్ల కాలంలో ఆయన అధికారికంగా ప్రకటించిన ఆస్తులు సుమారు 3300% పైగా పెరిగాయి..

ఈ క్రమంలో కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సందర్భాల్లో ఈ ఆస్తుల పెరుగుదలపై విమర్శలు చేసారు. అయితే, దీనిపై హరీష్ రావు స్పందిస్తూ, తన జీవితం, ఆస్తుల వివరాలు ఒక తెరిచిన పుస్తకం అని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లలో సర్వే నంబర్లతో సహా చట్టబద్ధమైన భూములు, ఆస్తుల వివరాలన్నింటినీ స్పష్టంగా పొందుపరిచానని, తానేమీ దాచలేదని ఆయన స్పష్టం చేశారు..

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. అఫిడవిట్లలో చూపించినది కేవలం ఆవగింజంత మాత్రమేనని, తెర వెనుక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ శివార్లతో పాటు వివిధ జిల్లాల్లో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాంహౌస్‌లు, నమ్మకస్తుల, బినామీల పేర్లపై నడుస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హరీష్ రావు అండదండతోనే సాగుతున్నాయని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

వేల కోట్ల కాంట్రాక్టులు - రాష్ట్ర ఖజానాపై పడ్డ భారం

మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన కాలంలో హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలపై తీవ్రమైన రాజకీయ విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరంతో పాటు పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో బడ్జెట్ అంచనాలను ఊహించని రీతిలో పెంచేశారని, ఇందులో పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారాయనేది ప్రధానమైన ఆరోపణలున్నాయి. అదీగాక బినామీ సంస్థల ద్వారా తనకు అనుకూలమైన పెద్ద కాంట్రాక్టర్లకే వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఇలా బీఆర్ఎస్ దొరలు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు, ప్రజాధనం దుర్వినియోగం రాష్ట్ర ఖజానాకు పూడ్చలేని లోటని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు..

పాల వ్యాపారం-క్విడ్ ప్రో కో ఆరోపణలు

మరోవైపు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. తనకు సంబంధించిన డైరీ కంపెనీ (Milchy Milk) వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మొదట్లో రూ. 7 కోట్ల ఆదాయం ఉన్న ఈ కంపెనీ, హరీష్ రావు పదవి నుంచి దిగిపోయే నాటికి రూ. 198 కోట్లకు చేరిందని, నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు కిమ్స్, కామినేని, యశోద వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు పాలు సరఫరా చేస్తూ వందల కోట్ల వ్యాపారానికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపించారు.

అలాగే గతంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసిన ఒక అధికారి హరీష్ రావు క్యాంప్ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో బెదిరింపులు, అక్రమ నిఘా, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నమోదైన ఒక కేసు దర్యాప్తులో హరీష్ రావు పేరును కూడా పోలీసులు చేర్చారని వార్తలు వచ్చాయి..

పొటా పోటీగా దోపిడీ!..

గత ప్రభుత్వ హయాంలో అధికారం అంతా ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతమైందనే విమర్శలు బలంగా వినిపించాయి. దోపిడీ, అక్రమ సంపాదన విషయంలో మామ కేసీఆర్, బావమరిది కేటీఆర్‌‌లతో పోటీపడి అల్లుడు హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ కాలంలో ప్రజల తరఫున నిలబడిన నాయకుడు, అధికారంలోకి వచ్చాక సొంత సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు హారీష్ రావు రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, ప్రాజెక్టుల అక్రమాలపై విచారణలు సాగుతుండటంతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో కనబడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ అక్రమ ఆస్తుల వ్యవహారం కాంగ్రెస్-బీఆర్ఎస్ కు ప్రధాన ఆయుధంగా మారే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు..

#HarishRao#KTR#KCR#BRS#TelanganaPolitics#HarishRaoAssets#KaleshwaramProject#TelanganaCongress#PoliticalAnalysis#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి