ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా మేలు కలిగేలా ఉండాలి.. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టం కలిగించకూడదు. కానీ అనాలోచిత నిర్ణయాలు,తొందరపాటు తనం, కొందరి ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. ఒక్కో సారి ప్రభుత్వ అసమర్థనను బయటపెడతాయి.. తాజాగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కూడా ప్రస్తుతం విమర్శలకు నిలయంగా మారింది.
హైదరాబాద్ నగరంలో అతిప్రధానమైన రహదారి.. నిత్యం ట్రాఫిక్ తో నగర వాసులకు చుక్కలు చూపించే కేబీఆర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం దీని చుట్టూ మొత్తం 14 స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మించడానికి సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా ఆగస్టు 18 నుండి సుమారు రెండేళ్లపాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు..
ఈ హెచ్-సిటి ప్రాజెక్టు మొత్తం 24 నెలలు కాలపరిమితితో నిర్మించబడుతుందని, దీని అంచనా వ్యయం రూ. 1,090 కోట్లుగా ప్రకటించారు. అయితే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ చేపట్టిన ప్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైన్ చేస్తూ ఆ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే టెండర్ విధానంలో చెల్లించిన డిపాజిట్లను తిరిగి చెల్లిస్తూ KNR నిర్మాణ సంస్థకు జారీ చేసిన లెటర్ ఆఫ్ అవార్డును ఉపసంహరించుకున్నట్లు జయేశ్ రంజన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ముఫఖంజా కాలేజీ వరకు ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఆ వంతెనను బంజారాహిల్స్ రోడ్ నెం-1 కు అనుసంధానించేలా ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో అనుమతి ఇచ్చిన రూ.1,090 కోట్ల నిధులను కుదించారు. ప్యాకేజీ-1లో మంజూరైన ప్రాజెక్టు వ్యయం రూ.580 కోట్ల నుంచి రూ.365 కోట్లకు తగ్గించగా... ప్యాకేజి-2లో మంజూరైన ప్రాజెక్టు వ్యయాన్ని రూ.510 కోట్ల నుంచి రూ.349 కోట్లకు కుదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఈపీసీ విధానంలో ఈ ప్రాజెక్టును ఆధునిక స్టీల్ స్ట్రక్చర్ సాంకేతికతతో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ముగ్దా జంక్షన్ వరకు తొలి ప్యాకేజీ పనులు చేపట్టనుండగా.. ముగ్దా జంక్షన్ నుంచి ముఫకంజా కళాశాల వరకు రెండో ప్యాకేజీ పనులను ప్రారంభించనున్నారు.. అలాగే బంజారాహిల్స్ రోడ్ నం-1కు కనెక్టింగ్ ర్యాంపు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖరీదైన ప్రైవేటు భూముల సేకరణ తగ్గనుందని.. ఫలితంగా సుమారు రూ.800కోట్లు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతంలో ప్రతిపాదించిన అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణంతో పోలిస్తే మరో రూ.400 కోట్ల నిర్మాణ వ్యయం తగ్గనున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా రూ.1,200 కోట్ల ప్రజాధనం ఆదా కానుందని అధికారులు వివరించారు.
ఏది ఏమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టిన ప్రాజెక్టు పనులను నిలిపివేయడంతో ఇప్పటివరకు ఖర్చు చేసిన ప్రజాధనం, జరిగిన పర్యావరణ నష్టం ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది. ప్రాజెక్టు సర్వే, సాయిల్ టెస్టింగ్, డిజైన్లు, తవ్వకాలు, పిల్లర్ల కోసం ఐరన్ రాడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక పనులకు ప్రస్తుతం వరకు సుమారు 300 కోట్ల వరకు ఖర్చయినట్లు అంచనా వేస్తున్నారు..
ఇప్పుడు ప్రాజెక్టు రద్దుతో ఆ నిర్మాణాలను తొలగించడం, తవ్విన గుంతలను పూడ్చడం వంటి పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఖర్చయిన నిధులతో పాటు, వాటిని తొలగించేందుకు మరోసారి నిధులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ పనుల కోసం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు 3,000 చెట్లను తొలగించినట్లు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టు ఆగిపోవడంతో నిర్మాణ పనులను వెనక్కి తీసుకోవచ్చు.. కానీ సంవత్సరాలుగా పెరిగిన చెట్లను, కోల్పోయిన పచ్చదనాన్ని వెంటనే పునరుద్ధరించడం సాధ్యం కాదు అంటే ప్రకృతికి నష్టం జరిగినట్టే కదా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో తవ్విన గుంతలు, ఏర్పాటు చేసిన పిల్లర్ నిర్మాణాల కారణంగా రోడ్ల వెడల్పు తగ్గి వాహనదారులు నెలల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు నిర్మాణాలను తొలగించిన తర్వాత కూడా నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, గుంతలను పూడ్చడం, రోడ్లను తిరిగి పటిష్టం చేయడం పూర్తయ్యే వరకు ఆయా మార్గాల్లో ప్రయాణించే వారికి ఆటంకాలు తప్పవు.. ఒకవైపు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు.. మరోవైపు వేలాది చెట్ల తొలగింపు.. చివరికి ప్రాజెక్టు రద్దు. దీంతో కేబీఆర్ పరిసరాల వ్యవహారం, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ నిర్ణయాల తీరును ప్రశ్నించే అంశంగా మారింది.


