Harmanpreet Kaur: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడం వెనుక అసలు గుట్టు విషయం బయటపడింది. బీసీసీఐ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయమే ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి చెందిన హర్మన్.. ఏకంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని గట్టి షాకిచ్చిందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
వన్డేలకే పరిమితం చేస్తామన్న బోర్డు
టీ20 జట్టు పగ్గాలను మరొకరికి అప్పగించి, హర్మన్‌ను కేవలం వన్డేలకే కెప్టెన్‌గా ఉంచాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే ఈ స్ప్లిట్ కెప్టెన్సీ ఆఫర్‌ను హర్మన్‌ప్రీత్ ముఖం మీదే తిరస్కరించిందని తెలుస్తుంది. నాయకత్వం ఇస్తే అన్నింటికీ ఉండాలి కానీ, ఇలా అరకొరగా బాధ్యతలు తీసుకోవడం తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టిందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. బోర్డు పెట్టిన ఈ కండిషన్ హర్మన్‌ప్రీత్‌కి నచ్చకపోవడంతోనే ఆమె అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
స్మృతి మంధానకు పగ్గాలు..
రాబోయే టీ20 ప్రపంచకప్‌తో పాటు 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను రీబిల్డ్ చేయాలన్నది బీసీసీఐ ప్లాన్‌గా కనిపిస్తుంది. అందుకోసమే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చేతుల్లోకి పూర్తిస్థాయి జట్టు పగ్గాలు అప్పగించాలని సెలక్టర్లు ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్‌ను తప్పించేందుకు బోర్డు వేసిన ఈ ఎత్తుగడ నచ్చకే హర్మన్ అలిగి పక్కకు తప్పుకుందా అనే చర్చ ఇప్పుడు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












