Indiramma Illu: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. అర్హులైన పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పేదల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
పేదలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఏడాదిలోగా ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు ఇంటి తాళాలు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నగరానికి దూరంగా కాకుండా నగరం నడిబొడ్డున అదీ ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు.
ఎంతో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల కోసం 7వేల 500మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ విధానం ద్వారా 480మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎంతో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన గృహాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
''ప్రభుత్వమే స్థలం సేకరించి ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఇళ్లు నిర్మిస్తోంది. అందుబాటులో ఉన్న వనరులతో ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆరు గ్యారెంటీలలో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం చేస్తున్నాం కూడా. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ బాగుండాలని ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేర్చే కార్యక్రమాన్ని పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ చిన్న అన్నగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు'' అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఏడాదిలోగా ఇంటి తాళం ఇస్తాం
''అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చాం. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు మేము ఆగలేదు. ఇప్పటికే టెండర్లు పిలిచాము. పని కూడా మొదలుపెట్టాము. ఏడాది లోపే ఇల్లు పూర్తి చేసి ఇంటి తాళం మీ చేతికి ఇచ్చే బాధ్యత నాది'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.


