తెలంగాణ

OYO Rooms: ఓయో రూముల్లో భయంకర ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

OYO Rooms: ప్రైవసీ అనే ఒకే ఒక్క మాటను నమ్మి గది తలుపులు వేసుకుంటున్న యువతులకు, ఆ నాలుగు గోడలే సమాధులుగా మారుతున్న భయానక వాస్తవం ఇప్పుడు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒకప్పుడు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో కలిసేవి.. కానీ నేడు ‘ప్రైవసీ’ ముసుగులో హోటల్ గదుల వైపు అడుగులు వేస్తున్నారు. తీరా ఆ తలుపులు మూసుకున్నాక ప్రేమ మాయమై, క్షణికావేశాలు, దురాశల రూపంలో మారణకాండ సాగుతోంది.

OYO Rooms: ప్రైవసీ అనే ఒకే ఒక్క మాటను నమ్మి గది తలుపులు వేసుకుంటున్న యువతులకు, ఆ నాలుగు గోడలే సమాధులుగా మారుతున్న భయానక వాస్తవం ఇప్పుడు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒకప్పుడు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో కలిసేవి.. కానీ నేడు ‘ప్రైవసీ’ ముసుగులో హోటల్ గదుల వైపు అడుగులు వేస్తున్నారు. తీరా ఆ తలుపులు మూసుకున్నాక ప్రేమ మాయమై, క్షణికావేశాలు, దురాశల రూపంలో మారణకాండ సాగుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు వేర్వేరు ఓయో హోటల్ గదుల్లో దారుణ హత్యకు గురికావడం రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది.

12 రోజులు.. 3 శవాలు..

నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు తేదీలు.. కానీ జరిగిన దారుణం మాత్రం ఒక్కటే. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయిన యువతులు, తాళాలు వేసి పరారైన ప్రియుళ్లు. సెప్టెంబర్ 21, మాదాపూర్ సిద్దిఖీ నగర్ ఓయో రూమ్ నెంబర్ 303లో విశాఖకు చెందిన నికిత దారుణ హత్యకు గురైంది.

ముఖంపై తీవ్ర గాయాలు, తలకు బలమైన దెబ్బలతో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెతో వచ్చిన ప్రియుడు శ్రీనివాస రవితేజ సొంతూరు పారిపోయి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 29, ఎస్సార్ నగర్‌లోని గోకుల్ ప్రైడ్ ఓయో రూమ్ నెంబర్ 103లో శిరీష అనే యువతి అచ్చం వారం రోజుల క్రితం నికిత అనే యువతి ఎలా అయితే మరణించిందో అదే తరహాలో విగతజీవిగా తేలింది. తప్పుడు వివరాలతో రూమ్ బుక్ చేసిన నిందితుడు ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఈ రెండు గదుల్లోనూ ఖాళీ మద్యం బాటీల్స్ దొరకడం గమనార్హం.

అక్టోబర్ 2, మియాపూర్‌లోని గ్రాండ్ బ్రోచిల్ హోటల్ రూమ్ నెంబర్ 502లో హనుమకొండకు చెందిన సృజన దారుణ హత్యకు గురైంది. గదికి తాళం వేసి నిందితుడు పరారవగా, మూడు రోజుల పాటు శవం కుళ్లిపోయి దుర్వాసన వచ్చేవరకు అసలు విషయం బయటకు రాలేదు.

బంగారు గొలుసు కోసం పిలిచి..

మియాపూర్ కేసులో వెలుగుచూసిన నిజాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడు రవి స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌లో తల్లిదండ్రులపై నిత్యం దాడులు చేస్తుండటంతో మూడు నెలల క్రితమే గ్రామస్థులు అతడిని వెలివేశారు. గతంలో సృజన వద్ద తీసుకున్న బంగారు గొలుసును తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె నిలదీసింది.

చైన్ ఇస్తానని నమ్మించి ఆమెను హైదరాబాద్‌ పిలిపించిన రవి, రూమ్ నెంబర్ 502లో ముందుగా స్నేహితులతో మద్యం పార్టీ చేసుకున్నాడు. సృజన రాగానే స్నేహితులు వెళ్లిపోగా, ఆ రాత్రి గదిలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. మరుసటి రోజు రూమ్‌ను పొడిగిస్తున్నట్లు సిబ్బందిని నమ్మించి తాళం వేసి పారిపోయాడు. మూడు రోజుల పాటు శవం గదిలోనే ఉన్నా ఎవరికీ అనుమానం రాకపోవడం హోటళ్ల నిర్వహణ డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది.

కాసుల కక్కుర్తిలో హోటళ్లు..

ప్రైవసీ పేరిట గదులు ఇచ్చే హోటల్ ఓనర్స్ కనీస భద్రతా నిబంధనలను గాలికొదిలేయడం వల్లే ఈ హత్యలు నిరాటంకంగా సాగుతున్నాయని అంటున్నారు. గది తీసుకునే వారి ఒరిజినల్ ఐడీలను క్షుణ్ణంగా పరిశీలించకుండా, నకిలీ వివరాలతో రూమ్స్ కేటాయించేస్తున్నారు. ఒక గదిలోకి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు అనే కనీస రికార్డ్స్ కూడా ఓనర్స్ మెయిన్‌టెన్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.

రూమ్ తీసుకున్న వ్యక్తి ఒక్కడే బయటకు వెళ్లి రోజుల తరబడి రాకపోయినా, సర్వీస్ సిబ్బంది కనీసం తలుపు తట్టి చూడకపోవడం హోటళ్ల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షణికానందం, గుడ్డి నమ్మకంతో హోటల్ గదుల వరకు వెళ్లే యువతులు ఇలాంటి సైకోల చేతుల్లో బలవుతున్నారని పెద్దలు చెబుతున్నారు. రూల్స్ పాటించని హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. ప్రైవసీ ముసుగులో నాలుగు గోడల మధ్య సాగే ఈ రక్తచరిత్ర మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంటుందని వారు అంటున్నారు.

#Hyderabad OYO Rooms#OYO Rooms#OYO Hotel#Hyderabad Crime#Hyderabad Crime News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి