International

రష్యాలో ప్లేగు కలకలం.. భారత్ అప్రమత్తం కావాల్సిందేనా?

రచన: Kashi••8 నిమిషాల పఠనం

భారత్‌కు ప్లేగు కొత్త విషయం కాదు. 1994లో దేశంలో ప్లేగు కలకలం రేపింది. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో కేసులు నమోదైన తర్వాత గుజరాత్‌లోని సూరత్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ సమయంలో వందలాది కేసులు, మరణాలు నమోదయ్యాయి. అందుకే ఇప్పుడీ టెన్షన్.

మరో మహమ్మారి ముంగిట ప్రపంచం

రష్యాలో ప్లేగు కలకలంతో తీవ్ర కలవరం

భారత్ అప్రమత్తం కావాల్సిందేనా..?

రష్యాలోని సైబీరియాలో అనుమానాస్పద న్యూమోనిక్ ప్లేగు కేసు కలకలం రేపుతోంది. ప్లేగు పరిశోధనా కేంద్రంలో పనిచేసే 28 ఏళ్ల ల్యాబ్ వర్కర్ డార్యా షిపిలోవా తీవ్ర న్యూమోనియాతో మృతి చెందడం, ఆ తర్వాత ఆమెతో సంబంధం ఉన్నవారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయితే అసలు ప్రశ్న ఒక్కటే.. రష్యాలో భయపెడుతోంది నిజంగా ప్లేగేనా? ఒకవేళ ప్లేగు అయితే అది భారత్‌కు కూడా ముప్పుగా మారే అవకాశముందా?

సైబీరియాలో అసలేం జరిగింది?

ఈ ఘటన ఇర్కుట్స్క్‌లోని యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చుట్టూ తిరుగుతోంది. తీవ్ర న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన షిపిలోవాకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్లేగు బ్యాక్టీరియాపై పరిశోధనలు చేసే సంస్థలో పనిచేయడం అనుమానాలకు కారణమైంది.

కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల్లో ఆమెకు ప్రయోగశాలలో ప్లేగు బ్యాక్టీరియా ఉండే టెస్ట్ ట్యూబ్ పగిలిన ఘటనతో సంబంధం ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని రష్యా అధికారులు ధృవీకరించలేదు. అంతేకాదు.. ఆమె శరీరంలో ప్లేగు సూక్ష్మజీవులు గుర్తించలేదని రష్యా ప్రజారోగ్య అధికారులు వెల్లడించారు.

అయినా ఎందుకు క్వారంటైన్?

ఇక్కడే అసలు ఆందోళన మొదలైంది. అనుమానం మాత్రమే ఉన్నప్పటికీ ఆమెకు దగ్గరగా ఉన్నవారిని గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లోనూ క్వారంటైన్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. రష్యా అధికారులు మాత్రం ఇప్పటివరకు విస్తృత స్థాయిలో వ్యాధి వ్యాప్తికి ఆధారాలు లేవని చెబుతున్నారు. అనుమానిత కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఇప్పటివరకు లక్షణాలు కనిపించలేదని, పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.

రష్యా చీఫ్ స్టేట్ శానిటరీ డాక్టర్ అన్నా పొపోవా కూడా సైబీరియాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అంటే.. వ్యాధి నిర్ధారణ కాకపోయినా, అధికారులు దీన్ని సాధారణ న్యూమోనియాగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట.

అమెరికా ఎందుకు నిశితంగా గమనిస్తోంది?

ఈ కేసుపై అమెరికా కూడా దృష్టి పెట్టింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రష్యా నుంచి అందుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు. అమెరికా ఆందోళనకు కారణం ప్లేగు నిర్ధారణ అయిందనే విషయం కాదు. ఒకవేళ యాంటీ-ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో పనిచేసే వ్యక్తికి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే.. అది అక్కడి ఇతరులకు వ్యాపించిందా? అన్న సందేహం అగ్రరాజ్యాన్ని వెంటాడుతోంది.

ఇదే సమయంలో ప్రపంచంలో ఒక ప్రాంతంలో అంటువ్యాధి అదుపు తప్పితే అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా అది మరింత దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే అనుమానాస్పద ఘటనలపైనా దేశాలు ముందుగానే నిఘా పెడతాయి. ఎందుకంటే.. కరోనా కల్లోలం ఇంకా మన కళ్ల ముందే కనపడుతోంది.

న్యూమోనిక్ ప్లేగ్ ఎందుకు ప్రమాదకరం?

ప్లేగుకు కారణం యెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా. సాధారణంగా ఈ బ్యాక్టీరియా చిన్న జంతువులు, వాటిపై ఉండే ఈగల ద్వారా ప్రకృతిలో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన ఈగ కుట్టడం లేదా సోకిన జంతువులతో సంబంధం ద్వారా మనుషులకు వ్యాధి రావచ్చు.

కానీ న్యూమోనిక్ ప్లేగ్‌లో పరిస్థితి మరింత సీరియస్. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఈ రూపం తీవ్రమైన న్యూమోనియాకు దారితీస్తుంది. దగ్గు, జ్వరం, చలి, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి శ్వాసకణాల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండటం వల్ల దీనిపై ప్రత్యేక జాగ్రత్త అవసరం.

అయితే ఈ లక్షణాలు ఇతర అనేక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలోనూ కనిపిస్తాయి. కాబట్టి కేవలం తీవ్ర న్యూమోనియా ఉందని ప్లేగుగా నిర్ధారించలేం. పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎపిడెమియాలజికల్ ఆధారాలే కీలకం.

భారత్ ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

భారత్‌కు ప్లేగు కొత్త విషయం కాదు. 1994లో దేశంలో ప్లేగు కలకలం రేపింది. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో కేసులు నమోదైన తర్వాత గుజరాత్‌లోని సూరత్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ సమయంలో వందలాది కేసులు, మరణాలు నమోదయ్యాయి.

అయితే మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు పరిస్థితిని 1994తో పోల్చడం కూడా సరైంది కాదు. వైద్య రంగంలో పురోగతి, మెరుగైన నిఘా వ్యవస్థలు, ప్రయోగశాల పరీక్షలు, యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండటం వల్ల ప్లేగును గుర్తించి చికిత్స చేయగల సామర్థ్యం గతంతో పోలిస్తే చాలా మెరుగుపడింది.

భయం కాదు.. నిఘా ముఖ్యం

అయితే ఈ ఘటనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఒకవైపు తెలియని కారణంతో వచ్చిన తీవ్రమైన న్యూమోనియా.. మరోవైపు యాంటీ-ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో పనిచేసిన వ్యక్తి.. దానికి తోడు కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ చర్యలు.. ఇవన్నీ కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థలు, ఇతర దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి.

కాబట్టి ప్రస్తుతం భారత్‌కు సరైన విధానం భయపడటం కాదు.. అప్రమత్తంగా ఉండటం. రష్యా నుంచి వచ్చే అధికారిక సమాచారం, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు, కొత్త కేసులు నమోదవుతున్నాయా లేదా అన్నదానిపై నిఘా కొనసాగాలి.

#Russia Plague#Pneumonic Plague#Plague Scare#India High Alert#Russia Plague Case#Yersinia Pestis#Pneumonic Plague India#India Health Alert#Global Health#Disease Outbreak#Plague Symptoms#Russia News#India News#Public Health#Infectious Disease#Health News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి