Revanth Reddy: సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో పాటు ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.
"రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు శాంతియుతంగా రోడ్డెక్కిన ప్రతిపక్ష నేతలను అన్యాయంగా అదుపులోకి తీసుకోవడం ముమ్మాటికీ అప్రజాస్వామికం" అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పోలీసులను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తోందని.. జైళ్లు, లాఠీఛార్జీలు, తప్పుడు కేసులు గాంధీ కుటుంబానికీ, కాంగ్రెస్ శ్రేణులకూ కొత్తేమీ కాదని గుర్తు చేశారు.
సర్ ప్రక్రియ పేరిట పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతుకు కారణమైన ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ యుద్ధం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకునేదాకా ఈ నిరసన జ్వాలలు చల్లారే ప్రసక్తే లేదని రేవంత్ హెచ్చరించారు.


