రాష్ట్రంలో రాజకీయ పోరు రోజు రోజుకు ముదురుతుంది. మళ్ళీ అధికార పీఠం దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వ్యూహా రచనలో భాగంగా బీఆర్ఎస్ పై ఆరోపణలు, విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన స్కాముల వివరాలు.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన అంశం పై తీవ్ర ఆరోపణలతో ముందుకు వెళ్తున్నారు.
అయితే కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా బీఆర్ఎస్ సమాధానం ఇవ్వలేక తడబడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ కు దీటుగా కార్యాచరణకు సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు కౌంటర్‌గా కొడంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ సభ అనంతరం మంత్రుల నియోజకవర్గాల్లో సైతం సభలు నిర్వహించే దిశగా వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు.. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగించిన అస్త్రాలలో బీఆర్ఎస్ పాలనలోని వైఫ్యల్యాలు, అక్రమ దందాలు, ప్రాజెక్ట్ ల పేరుతో రాష్ట్ర ఖజానా లూటీ అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇక ప్రస్తుతం కూడా కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొనే విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం కనిపిస్తుంది.
ఇక కాంగ్రెస్ నేతలు ఇటీవలే బీఆర్ఎస్ నేతల వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌ల వద్దకు వెళ్లి ఆరోపణలు గుప్పించారు. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం సహా బహిరంగ సభలో కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పక ముందే.. హస్తం శ్రేణులను కట్టడి చేయాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో, ఆ తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ సీఎం పర్యటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ దూకుడుకు కౌంటర్‌గా రాజకీయ కార్యాచరణను మరింత ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతూనే.. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇకపై క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడంపై బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇక సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ సభ నిర్వహిస్తే.. ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అనేది ఆధిపత్యానికి, తిరుగులేని పట్టుకు సంకేతంగా ఉంటుంది. అలాంటి భేద్యమైన కోటలోనే నేరుగా సవాల్ విసరడం ద్వారా ప్రత్యర్థి వర్గాన్ని మానసికంగా డిఫెన్స్‌లో పడేయవచ్చనేది బీఆర్ఎస్ ప్రధాన వ్యూహంగా భావిస్తున్నారు.. రాష్ట్ర అధినేత గడపలోనే భారీ జనసమీకరణ చేసి సభను విజయవంతం చేస్తే, సీఎం సొంత ఇమేజ్‌పైనే నేరుగా దెబ్బకొట్టినట్లవుతుంది.
అంతేకాదు పార్టీ కేడర్‌లో ఊహించని ఉత్సాహాన్ని నింపుతుంది. సీఎం సొంత గడ్డపైనే సవాల్ చేయగలిగాం అనే నమ్మకం క్షేత్రస్థాయి కార్యకర్తలకు కొండంత బలాన్నిస్తుంది. అదీగాక అధికార పక్షాన్ని ఆత్మ రక్షణలో పడేసి, రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చను తమ చుట్టూ తిప్పుకోవడానికే బీఆర్ఎస్ ఈ భారీ సభకు స్కెచ్ వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కు చెక్ పెట్టే ప్రణాళికలో భాగంగా కేటీఆర్ ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలతో ఆ అంశంపై చర్చించినట్లు సమాచారం.
అలాగే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు కేసీఆర్ శైలి రాజకీయ వ్యూహాలను ఆయుధంగా మలచుకొని కాంగ్రెస్ చుట్టూ పద్మవ్యూహాన్ని అల్లుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ఎండగట్టడం, కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను ఆసరాగా చేసుకోవడం ఈ పద్మవ్యూహంలో భాగంగా చెప్పుకొంటున్నారు.
మరోవైపు క్షేత్రస్థాయిలో ఓట్ల చీలికను నివారించడం, ఓటర్లను తమవైపు తిప్పుకోవడం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికే కాంగ్రెస్ పార్టీని అన్ని వైపుల నుంచి ఆత్మరక్షణలో పడేసి పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడమే ఈ వ్యూహాత్మక చదరంగం వెనుక ఉన్న లక్ష్యంగా చర్చించుకుంటున్నారు.


