అభిప్రాయం

ఆ 45 ఎక‌రాల గుర్తింపున‌కు స‌ర్వే చేయండి- ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK•••6 నిమిషాల పఠనం

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎక‌రాల భూముల ఆచూకీ ల‌భ్యం కానుందున, వాటి గుర్తింపున‌కు వెంట‌నే స‌ర్వే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 22ఏపై శాసనసభలో గత నెల 16న నిర్వ‌హించిన చర్చలో ఆ భూముల‌పై విచార‌ణ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

* ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూములపై సమీక్ష

* ఎర్రవల్లిలో 45 ఎకరాలు మిస్సింగ్

* 45 ఎకరాల గుర్తింపునకు సర్వే

* ఎర్రవల్లిలో తెలంగాణ అమ‌రవీరుల కాల‌నీ

* వెలిక‌ట్ట‌లో ఎడ్యుకేష‌న్ హ‌బ్‌

* మ‌ల్ల‌న్న సాగ‌ర్ నీరు అక్ర‌మ వినియోగ‌దారుల‌పై చ‌ర్య‌లు

* ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Erravalli Lands: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎక‌రాల భూముల ఆచూకీ ల‌భ్యం కానుందున, వాటి గుర్తింపున‌కు వెంట‌నే స‌ర్వే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

22ఏపై గత నెల 16న శాసనసభలో నిర్వ‌హించిన చర్చలో ఆ భూముల‌పై విచార‌ణ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ మంగ‌ళ‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచార‌ణ‌కు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

ఆ 45 ఎకరాలు మిస్సింగ్

ఈ సంద‌ర్భంగా విచార‌ణ పురోగ‌తిపై క‌మిటీ స‌భ్యుల‌ను సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కానీ తాజా రెవెన్యూ సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీఎంకు వివ‌రించారు అధికారులు. రికార్డుల్లో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని అధికారులు తెలియ‌జేశారు.

కేసీఆర్‌కు నోటీసులు!

ఈ నేప‌థ్యంలో ఆ 45 ఎకరాల భూమి ఎక్కడ ఉంది, దాని హద్దులు రికార్డులు ఏమిటి అన్నది తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌ర్వే నెంబ‌ర్ 325 స‌మీపంలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున‌, వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలిపారు.

ఎర్రవల్లిలో తెలంగాణ అమరవీరుల కాలనీ

మరోవైపు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీ అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖ‌కు అప్ప‌గించాల‌ని సూచించారు. వచ్చే ఏడాది జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మ‌ల్ల‌న్న సాగ‌ర్ నీరు అక్ర‌మ వినియోగ‌దారుల‌పై చ‌ర్య‌లు

కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ తో పాటు ఎడ్యుకేష‌న్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎల్‌నినో నేప‌థ్యంలో రిజ‌ర్వాయ‌ర్లు, చెరువుల నీటిని జాగ్ర‌త్త‌గా వినియోగించాల‌ని అధికారుల‌కు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినిగియోంచే వారిని గుర్తించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

#Erravalli Lands#Erravalli#Venkatapuram#Cm Revanth Reddy#Kcr#Kcr Farmhouse#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి