National

స్టైల్ మార్చిన కాంగ్రెస్.. రోడ్డెక్కిన గాంధీ పరివార్!

రచన: Kashi••11 నిమిషాల పఠనం

కాంగ్రెస్ రాజకీయ శైలి నెమ్మదిగా మారుతోంది. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. అవసరమైతే రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు. కార్యకర్తల మధ్య నిలబడుతున్నారు. పోలీసుల్ని ఎదుర్కొంటున్నారు. అసలు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎందుకు మారుస్తోంది..?

కాంగ్రెస్ టాప్ గేర్

సర్ ఆందోళనలతో పార్టీలో జోష్

హస్తినలో రాహుల్ హల్ చల్

2029 ఎన్నికల ప్లాన్ ఇదేనా..?

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్న పార్టీ.. పెద్ద నాయకులు.. భారీ సభలు.. పార్లమెంట్ ప్రసంగాలు.. ఎన్నికల సమయంలో హడావుడి. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ రాజకీయ శైలి నెమ్మదిగా మారుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయాల్లో మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు. కార్యకర్తల మధ్య నిలబడుతున్నారు. పోలీసుల్ని ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త రాజకీయ కమ్యూనికేషన్‌లో భాగమవుతున్నాయి. అసలు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎందుకు మారుస్తోంది..?

ఢిల్లీలో కనిపించిన సీన్ కూడా ఈ మారుతున్న స్టైల్‌కు ఒక ఉదాహరణ మాత్రమే. ఛలో ఈసీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు కదిలారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకునే వరకు ఆయన అక్కడి నుంచి కదల్లేదు. ప్రియాంక కూడా అక్కడే ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో కార్యక్రమానికి సహజంగానే రాహుల్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు.

కానీ అసలు ఆసక్తి ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది అన్నదానిలో లేదు. కాంగ్రెస్ ఎందుకు ఈ స్థాయిలో రూట్ మార్చుకుంటోంది అన్నదానిలోనే ఉంది.

రాహుల్ గాంధీ రాజకీయ శైలి కొంతకాలంగా మారుతోంది. గతంలో విమర్శలు చేయడం.. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. ప్రెస్‌మీట్లు పెట్టడం ప్రధానంగా కనిపించేది. ఇప్పుడు దానికి గ్రౌండ్ ఫైట్ జోడవుతోంది. ప్రజా సమస్యలపై నేరుగా రోడ్డుపైకి రావడం.. ఆందోళనలకు నాయకత్వం వహించడం.. అరెస్టులు, పోలీసుల అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకపోవడం ద్వారా ఒక యాక్టివ్ ఆపోజిషన్ లీడర్ ఇమేజ్‌ను బలపరిచే ప్రయత్నం జరుగుతోంది.

ఇది కేవలం రాహుల్ వ్యక్తిగత స్టైల్ మార్పుగా చూడటం కూడా సరైంది కాదు. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమైనట్టుంది. బీజేపీ లాంటి శక్తివంతమైన రాజకీయ యంత్రాంగాన్ని ఎదుర్కోవాలంటే కేవలం విమర్శలు సరిపోవు. నిరంతరం ప్రజల్లో కనిపించాలి. రాజకీయంగా స్పందించడమే కాదు.. రాజకీయ నేరేటివ్‌ను తామే సెట్ చేయాలి. ఒక అంశం వచ్చిన తర్వాత దానిపై మాట్లాడటం కాకుండా.. తామే ఒక అంశాన్ని ముందుకు తీసుకురావాలి. దానిపై పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది అదే.

జెన్ జీ టార్గెట్ గా దూకుడు

ఇక ఇక్కడే కాంగ్రెస్ కొత్త వ్యూహంలో మరో కీలక అంశం కనిపిస్తోంది. అది యువత. జెన్ జీ రాజకీయాలను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. సంప్రదాయ రాజకీయ సభలు.. గంటలకొద్దీ ప్రసంగాలు.. పాత తరహా రాజకీయ నినాదాలు యువతపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. వాళ్లకు కావాల్సింది నేరుగా మాట్లాడే నాయకత్వం. తమ సమస్యలపై స్పందించే నాయకుడు. అవసరమైతే వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం చూపించే నాయకుడు. సోషల్ మీడియాలో కనిపించే విజువల్ పాలిటిక్స్ కూడా ఇప్పుడు చాలా కీలకం.

రాహుల్ గాంధీ కూడా ఈ మార్పును అర్థం చేసుకున్నట్టే కనిపిస్తున్నారు. యువతతో నేరుగా మాట్లాడటం.. విద్యార్థులు, ఉద్యోగార్థుల సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకురావడం.. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపించడం.. అదే సమయంలో రోడ్డుపై పోరాటాలకు దిగడం.. ఈ మొత్తం కలయిక వెనుక కొత్త తరాన్ని ఆకట్టుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

2029 ప్లాన్ ఇదేనా..?

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఎక్కువగా తన సంప్రదాయ ఓటు బ్యాంకుపైనే ఆధారపడిన పార్టీగా కనిపించింది. కానీ 2029కి వెళ్లే దారిలో ఆ లెక్కలు మారాల్సిందే. పాత ఓటర్లు మాత్రమే సరిపోరు. కొత్త ఓటర్లు ఎవరి వైపు నిలబడతారన్నదే కీలకం. ముఖ్యంగా తొలిసారి ఓటు వేసే యువతను ఆకట్టుకోగలిగితేనే కాంగ్రెస్ తన రాజకీయ పరిధిని పెంచుకోగలదు. అందుకే రాహుల్ దూకుడు వెనుక రాజకీయ లెక్క కూడా ఉండొచ్చు.

బీజేపీతో గేమ్ అంత ఈజీ కాదు...

బీజేపీని ఎదుర్కోవాలి. అదే సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనిపించాలి. అంతకంటే ముఖ్యంగా కొత్త తరం ముందు కాంగ్రెస్‌ను పాత పార్టీగా కాకుండా కొత్త రాజకీయ శక్తిగా ప్రొజెక్ట్ చేయాలి. ఈ మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించాలంటే కాంగ్రెస్‌కు ఇప్పటి కంటే చాలా యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇందులో ప్రియాంక గాంధీ పాత్ర కూడా కీలకమే. రాహుల్, ప్రియాంక ఇద్దరూ ఒకే కార్యక్రమంలో ముందుండటం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకమైన సిగ్నల్ ఇస్తుంది. నాయకత్వం కూడా తమతో కలిసి రోడ్డుపై నిలబడుతోందన్న భావన క్యాడర్‌లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఒకప్పుడు ఢిల్లీలోని పార్టీ కార్యాలయాల నుంచి రాజకీయాలు నడిచేవి. ఇప్పుడు నాయకత్వమే కార్యకర్తల మధ్యకు వెళ్లి పోరాటానికి ముందు నిలబడుతోంది. ఇది కాంగ్రెస్‌కు చాలా అవసరమైన మార్పు కూడా కావచ్చు.

ఎందుకంటే బీజేపీతో పోటీ పడాలంటే కేవలం ఎన్నికల సమయంలో యాక్టివ్ అయితే సరిపోదు. ఏడాది పొడవునా రాజకీయంగా యాక్టివ్ గా కనిపించాలి. ప్రతి అంశంపై పార్టీ స్పందించాలి. కార్యకర్తలను కదిలించాలి. సోషల్ మీడియాను ఉపయోగించాలి. ప్రజల్లో చర్చను సృష్టించాలి. ముఖ్యంగా ఒకే అంశంపై పార్టీ మొత్తం ఒకే స్వరంతో మాట్లాడే పరిస్థితి రావాలి. అంటే కాంగ్రెస్ ఇప్పుడు పాతకాలపు పార్టీ అనే ముద్ర నుంచి నిరంతర రాజకీయ పోరాటం చేసే పార్టీగా మారేందుకు ప్రయత్నిస్తోందన్న మాట.

ఇక్కడే 2029 అసలు టార్గెట్ కనిపిస్తోంది. 2029 ఎన్నికలు ఇంకా దూరంగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్‌కు తెలుసు.. చివరి ఏడాదిలో వ్యూహాలు మార్చడం ద్వారా పెద్ద మార్పు తీసుకురావడం కష్టం. పార్టీకి ఇప్పటి నుంచే కొత్త ఇమేజ్ కావాలి. రాహుల్‌కు బలమైన ప్రత్యామ్నాయ నాయకుడి ఇమేజ్ రావాలి. యువతలో గుర్తింపు కావాలి. కార్యకర్తల్లో ఉత్సాహం కావాలి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి ముందుగానే రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేయాలి. అందుకే 2029 ఎన్నికల ప్రచారం 2029లో మొదలయ్యేది కాదు. అది ఇప్పటి నుంచే మొదలవుతోందని భావించవచ్చు.

అయితే రోడ్డుపై పోరాటం చేయడం మాత్రమే విజయానికి సరిపోదు. అక్కడే కాంగ్రెస్ కు అసలు పరీక్ష మొదలవుతుంది. రాహుల్ దూకుడు మీడియాలో కనిపించవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు. యువతలో చర్చకు రావచ్చు. కానీ ఆ ఉత్సాహాన్ని ఓటుగా మార్చడం అంత సులభం కాదు. దానికి బలమైన సంస్థాగత వ్యవస్థ కావాలి. రాష్ట్రాల వారీగా నాయకత్వం కావాలి. బూత్ స్థాయిలో కార్యకర్తలు కావాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో కనిపించే అంతర్గత విభేదాలను నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి.

అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపిస్తున్న మార్పును కేవలం ఆందోళనలు, అరెస్టులు, నిరసనలతో కొలవలేం. ఇది ఒక పొలిటికల్ రీబ్రాండింగ్ ప్రయత్నం. పాత కాంగ్రెస్‌కు కొత్త దూకుడును జోడించే ప్రయత్నం. రాహుల్ గాంధీని కేవలం ప్రతిపక్ష నేతగా కాకుండా.. పోరాడే నాయకుడిగా చూపించే ప్రయత్నం. ప్రియాంకను కేవలం గాంధీ కుటుంబ వారసురాలిగా కాకుండా.. గ్రౌండ్‌లో పార్టీని కదిలించే నాయకురాలిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం. మొత్తానికి యువతకు కాంగ్రెస్‌ను కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం.

ఢిల్లీలో కనిపించిన రాహుల్, ప్రియాంక దూకుడు ఒకరోజు రాజకీయ ఘటనగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నిజంగానే తన స్టైల్ మార్చుకుంటే.. రాబోయే మూడేళ్లలో ఇలాంటి పోరాటాలు ఇంకా ఇంకా కనిపిస్తాయి. అందుకే.. 2029 కోసం కాంగ్రెస్ ఎంచుకున్న కొత్త పొలిటికల్ స్టైల్ ఇదేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Congress#Rahul Gandhi#Priyanka Gandhi#Rahul Gandhi Protest#Congress Strategy#Congress 2029#BJP vs Congress#Gen Z Politics#Indian Politics#Delhi Protest#Election Commission#Rahul Gandhi Street Fight#Congress News#Indian Political News#2029 Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి