తెలంగాణ

TG : మాటలతో కోటలు..హ్యాండిచ్చిన కర్ణాటక!

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ మంత్రుల బృందం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయి నీటి విడుదలకు ఒప్పించామని, జూరాలకు జలకళ తీసుకువచ్చామని హడావుడి చేశారు.

-నీళ్ల విషయంలో రైతులను మభ్యపెడుతున్న రేవంత్‌ రెడ్డి!

- కాంగ్రెస్ సర్కార్ వరద నీటినే లెక్క చూపిస్తోందా?

- నారాయణపూర్ గేట్లు బంద్

- కర్ణాటక స్థానిక నేతల అభ్యంతరం

- ఎండిపోతున్న ఆయకట్టు పంటలు

- ఆందోళనలో అన్నదాతలు

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్

జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ మంత్రుల బృందం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయి నీటి విడుదలకు ఒప్పించామని, జూరాలకు జలకళ తీసుకువచ్చామని హడావుడి చేశారు. అయితే, అక్కడ కర్ణాటక స్థానిక నేతలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తీవ్ర పంట కష్టాలు ఎదురవుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలా జలాశయానికి కృష్ణా జలాల విడుదల సక్రమంగా జరగకపోవడంతో వేలాది ఎకరాల్లో వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో పంటలను కాపాడుకోవడం రైతులకు కత్తిమీద సాములా మారుతున్నది.

కర్ణాటక నుంచి నీళ్లను తేవడంలో విఫలం

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ కేవలం 4.5 టీఎంసీలకు పడిపోగా, నిలబెట్టిన ఆయకట్టు పంటలు చేతికందాలంటే కనీసం 5 నుంచి 6 టీఎంసీల నీరు తక్షణమే అవసరమని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 మధ్య నారాయణపూర్ నుంచి జూరాలకు 27,600 క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అవన్నీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరద నీళ్లేనని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటక నుంచి నీళ్లను తేవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన వరద నీటినే తాము సాధించిన నీటి విడుదలగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆయకట్టు సీఎం రేవంత్ రెడ్డి రైతులను మభ్యపెడుతున్నారంటూ రైతు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లా రైతుల ఆవేదన

కర్ణాటక ప్రభుత్వం కావాలనే నారాయణపూర్ ప్రాజెక్ట్ గేట్లను తెరవకుండా నిలిపివేసిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ వైఖరి, జూరాలలో చాలీచాలని నీటి నిల్వల కారణంగా లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంట పొలాలు నెర్రలు చాచి ఎండిపోతున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కర్ణాటకతో చర్చించి, నారాయణపూర్ నుంచి అదనపు జలాలను విడుదల చేయించి తమ పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

#karnataka#water#farmers#telangana#No inflow#Juralaproject#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి