మోదీ లేకుంటే బీజేపీయే లేదా..?
బీజేపీలో వన్ మ్యాన్ షో
25 ఏళ్లలో పార్టీనే మార్చేసిన మోదీ
కమల దళంలో ఏం జరుగుతోంది..?
2001 అక్టోబర్ 7. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన రోజు. అక్కడి నుంచి 25 ఏళ్లు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు.. 2014 నుంచి ప్రధానిగా మరో దశాబ్దానికి పైగా. ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. 2026 అక్టోబర్ 7 నాటికి మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
కానీ మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఒక నాయకుడి విజయగాథగా చూస్తే కథ అర్థం కాదు. ఒకప్పుడు ఉమ్మడి నాయకత్వంగా పేరున్న బీజేపీలో.. ఒక నాయకుడే పార్టీకి ప్రైమ్ ఫేస్ గా ఎలా మారారు? అన్నది అసలు ఆసక్తికరమైన ప్రశ్న.
బీజేపీ అంటేనే సామూహిక నాయకత్వం..
బీజేపీ రాజకీయ సంస్కృతిని పరిశీలిస్తే.. వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు ఒకే సమయంలో పార్టీని నడిపించిన కాలం కనిపిస్తుంది. ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఒకరు మాస్ లీడర్ అయితే.. మరొకరు సంస్థాగత వ్యూహకర్త. ఇంకొకరు సిద్ధాంతపరమైన బలమైన గొంతుక. అంటే బీజేపీ అంటే ఒక్క నాయకుడి చుట్టూ తిరిగే పార్టీ అన్న ఇమేజ్ గతంలో లేదు. పార్టీ.. సిద్ధాంతం.. కేడర్.. నాయకత్వం అనే నాలుగు అంశాల చుట్టూ బీజేపీ ఎదిగింది.
అలాంటి పార్టీలోనే నరేంద్ర మోదీ ఒక దశలోకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2013-14 నాటికి మోదీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం.. 2014లో బీజేపీకి సొంత మెజారిటీ రావడం.. ఆ విజయాన్ని మోదీ నాయకత్వంతో అనుసంధానం చేయడం ఆయనకు పార్టీలో అసాధారణమైన రాజకీయ బలాన్ని ఇచ్చింది.
గుజరాత్ ప్రయోగం.. జాతీయ రాజకీయాలకు పునాది
మోదీ ఎదుగుదల ఒక్కసారిగా ఢిల్లీలో మొదలైనది కాదు. ఆయన ముందుగా ఆర్ఎస్ఎస్‌లో సంస్థాగత కార్యకర్తగా పనిచేశారు. తరువాత బీజేపీలో కార్యకర్తగా ఎదిగారు. గుజరాత్ బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 121 స్థానాలు గెలుచుకోవడంలో ఆయన సంస్థాగత నైపుణ్యం కీలకంగా నిలిచింది.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం ఆయన రాజకీయ శైలి మరో రూపం దాల్చింది.
పార్టీ సంస్థను నడిపిన నిర్వాహకుడి నుంచి.. తన పాలనను ఒక రాజకీయ బ్రాండ్‌గా మార్చుకున్న నాయకుడిగా మోదీ ఎదిగారు. అటు పార్టీ పెద్దలు, ఇటు ప్రజలు, కార్యకర్తల నుంచి ప్రశంసలను అందుకున్నారు.
గుజరాత్ అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, పరిపాలన వంటి అంశాలను తన రాజకీయ కథనంలో భాగం చేశారు. అదే సమయంలో తనపై వచ్చిన తీవ్ర రాజకీయ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఈ మొత్తం పరిణామం మోదీని కేవలం రాష్ట్ర నాయకుడిగా కాకుండా.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబెట్టింది.
2014.. అసలు టర్నింగ్ పాయింట్
మోదీ రాజకీయ జీవితంలో అసలు మలుపు 2014. బీజేపీ 282 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. 2009లో 116 స్థానాలకు పరిమితమైన పార్టీ.. కేవలం ఐదేళ్లలో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక్కడే ఒక కీలకమైన రాజకీయ మార్పు జరిగింది. బీజేపీ గెలిచిందా?
లేక మోదీ గెలిపించారా? ఎన్నికల తరువాత రాజకీయ చర్చలో రెండో వాదన బలపడింది. మోదీ పేరు.. మోదీ ఛరిస్మా, మోదీ ప్రసంగాలు.. మోదీ ప్రచారం.. మోదీ అభివృద్ధి మోడల్.. ఇవన్నీ కలిపి ఎన్నికల ప్రచారాన్ని ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకరించాయి.
దీంతో బీజేపీకి ఉన్న సంస్థాగత బలం ఒక వైపు ఉంటే.. దానికి మోదీ వ్యక్తిగత ప్రజాదరణ మరో భారీ ఎన్నికల ఆస్తిగా మారింది. వరుస విజయాలు.. నాయకుడి బలాన్ని మరింత పెంచాయి.
2014 ఒక్క విజయం మాత్రమే అయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ 2019లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంది. 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు. ఇక్కడ మోదీకి రాజకీయంగా మరో పెద్ద ప్రయోజనం లభించింది. మోదీ నాయకత్వంలోనే బీజేపీ గెలుస్తోంది అనే భావన పార్టీ లోపల, బయట మరింత బలపడింది. అంతేకాదు.. బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. ఉత్తరాది పార్టీగా ఉన్న బీజేపీ.. దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో తన రాజకీయ స్థావరాన్ని పెంచుకోవడంలో మోదీ బ్రాండ్ కీలకంగా మారింది. మోదీ ప్రజాదరణ బీజేపీకి జాతీయ మద్దతు తెచ్చింది.
అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ముందు బీజేపీకి ఓటు వేయడానికి మోదీ ఒక కారణం అయ్యారు. తర్వాత మోదీకి ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేయడంగా మారింది.
బీజేపీలో ‘వన్ మ్యాన్ ఆర్మీ’
ఇదే అసలు ప్రశ్న. బీజేపీకి మొదటి నుంచే బలమైన కేడర్ ఉంది. ఆర్ఎస్ఎస్‌తో సంస్థాగత అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం ఉంది. బూత్ స్థాయి వరకు పనిచేసే కార్యకర్తల వ్యవస్థ ఉంది. అయితే మోదీ ఆ సంస్థాగత బలాన్ని తన వ్యక్తిగత రాజకీయ బ్రాండ్‌తో కలిపారు. సంస్థ, నాయకత్వం, సంక్షేమం, జాతీయవాదం, బలమైన కమ్యూనికేషన్.. ఈ కాంబినేషన్ మోదీకి ప్రత్యేకమైన రాజకీయ స్థానం తెచ్చింది.
ఇతర నాయకులు ఒక నియోజకవర్గం, ఒక రాష్ట్రం లేదా ఒక వర్గానికి బలమైన నాయకులుగా ఉండొచ్చు. కానీ మోదీ తనను తాను దేశవ్యాప్తంగా ఒకే రకమైన రాజకీయ సందేశానికి కేంద్రబిందువుగా మలుచుకున్నారు. అందుకే ఆయన పేరు ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ప్రభుత్వ పథకాల బ్రాండింగ్‌లో కూడా పదేపదే కనిపించింది.
బీజేపీ ‘వ్యక్తి పూజ’ పార్టీ కాదు.. మరి మార్పు ఎలా వచ్చింది?
ఇక్కడే మోదీ రాజకీయ ప్రయోగం ప్రత్యేకంగా కనిపిస్తుంది. బీజేపీ చరిత్రలో సిద్ధాంతం, సంస్థ, కేడర్ అనే అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ మోదీ యుగంలో వ్యక్తిగత నాయకత్వం, సంస్థాగత యంత్రాంగం ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు కనిపించింది.
2014 తర్వాత పార్టీ నిర్ణయ ప్రక్రియ మరింత కేంద్రీకృతమైందది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి పాత తరం నేతలు కీలక నిర్ణయ వ్యవస్థల నుంచి తప్పుకోవడం కూడా ఈ మార్పుకు ఒక సంకేతంగా చెబుతారు. ఇది కేవలం మోదీ వ్యక్తిగత నిర్ణయం వల్లే జరిగిందని చెప్పడం సులభమైన వివరణ. కానీ రాజకీయంగా చూస్తే.. అసలు కారణం విజయమే. ఒక నాయకుడు వరుసగా ఎన్నికలు గెలిపిస్తే.. పార్టీ సహజంగానే ఆ నాయకుడి చుట్టూ మరింత కేంద్రీకృతమవుతుంది. అదే మోదీ విషయంలో జరిగింది.
ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ లేదా?
ఇది బీజేపీ రాజకీయ పరిణామంలో అత్యంత కీలకమైన అంశం. వాజ్‌పేయి కాలంలో అద్వానీ ఒక సహజమైన ప్రత్యామ్నాయ శక్తికేంద్రం. అద్వానీ కాలంలోనూ పార్టీకి అనేక మంది సీనియర్ నేతలు, ప్రాంతీయ నాయకులు ఉన్నారు. కానీ మోదీ కాలంలో అలాంటి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ నాయకత్వం స్పష్టంగా ఎదగలేదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి.
మొదటిది.. మోదీ వ్యక్తిగత ప్రజాదరణ స్థాయి. రెండోది.. పార్టీ సంస్థాగత వ్యవస్థపై కేంద్ర నాయకత్వం పెంచుకున్న నియంత్రణ.
మోదీతో కలిసి అమిత్ షా వంటి శక్తివంతమైన సంస్థాగత నాయకత్వం కూడా ఏర్పడింది. దీంతో ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థ, ప్రభుత్వ పాలన.. మూడు వేర్వేరు ట్రాక్‌లుగా కాకుండా ఒకే రాజకీయ కమాండ్ వ్యవస్థలో పనిచేసే పరిస్థితి ఏర్పడింది. కార్నెగీ కూడా మోదీ-షా కాలంలో పార్టీ అధికార నిర్మాణం మరింత కేంద్రీకృతమైంది.
మోదీ బలానికి మరో రహస్యం.. ప్రత్యర్థి లేకపోవడం కాదు, ప్రత్యామ్నాయం లేకపోవడం. మోదీని బలోపేతం చేసింది కేవలం బీజేపీ విజయాలు కాదు. ఇక్కడ ప్రత్యర్థి పార్టీల బలహీనత కూడా కీలకంగా పనిచేసింది. 2014లో కాంగ్రెస్‌పై ఉన్న అవినీతి, పాలనాపరమైన అసంతృప్తి.. 2019లో జాతీయ భద్రత, సంక్షేమం, బలమైన నాయకత్వం వంటి అంశాలు.. ఇవన్నీ మోదీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించాయి.
అదే సమయంలో ప్రతిపక్షం నుంచి దేశవ్యాప్తంగా మోదీకి సమానమైన వ్యక్తిగత ఆకర్షణ కలిగిన ప్రత్యామ్నాయ నాయకుడు ఎదగలేదు.
అందుకే పోటీ చాలా సందర్భాల్లో మోదీ వర్సెస్ ప్రతిపక్షంగా మారింది. కేవలం బీజేపీ వర్సెస్ మరో పార్టీగా కాదు. ఇది ఒక నాయకుడి రాజకీయ బలాన్ని మరింత పెంచే పరిస్థితి.
2024 ఏం చెప్పింది?
అయితే మోదీ కథను ఇక్కడే ముగించడం కూడా తప్పే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయింది. అంటే మోదీ ప్రభావం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత ప్రజాదరణ తగ్గిందన్నది కూడా స్పష్టమవుతోంది. బీజేపీ 2019లో 303 స్థానాలు గెలిచిన స్థాయి నుంచి 2024లో 240 స్థానాలకు వచ్చింది. అయినప్పటికీ ఎన్డీఏ భాగస్వామ్యాలతో మోదీ మూడోసారి ప్రధానిగా కొనసాగారు.
అంటే మోదీ రాజకీయ బ్రాండ్ బలంగానే ఉన్నా.. దానికి పరిమితులు కూడా ఉన్నాయని 2024 ఫలితం గుర్తుచేసింది. అయితే అసలు మారింది బీజేపీనా? లేక భారత రాజకీయాలేనా? ఇది మోదీ 25 ఏళ్ల ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన ప్రశ్న.
మోదీ బీజేపీని మార్చారా? లేదా మారుతున్న భారత రాజకీయాలను అర్థం చేసుకుని బీజేపీని కొత్త రూపంలోకి తీసుకెళ్లారా? బహుశా రెండూ జరిగి ఉండొచ్చు.
టెలివిజన్ నుంచి సోషల్ మీడియా వరకు.. భారీ ర్యాలీల నుంచి డిజిటల్ ప్రచారం వరకు.. సంక్షేమ పథకాల నుంచి జాతీయ భద్రత వరకు.. ప్రతి అంశాన్ని ఒకే నాయకుడి రాజకీయ కథనంతో అనుసంధానం చేయడంలో మోదీ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు.
దీంతో బీజేపీ ఒక సంస్థగా కొనసాగుతూనే.. మోదీ అనే వ్యక్తి ఆ సంస్థకు అత్యంత శక్తివంతమైన పొలిటికల్ ఫేస్ గా మారిపోయారు.
25 ఏళ్ల తర్వాత మిగిలిన అసలు ప్రశ్న
మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కేవలం ఒక నాయకుడి దీర్ఘకాల అధికార ప్రయాణం కాదు. ఇది ఒక కేడర్ ఆధారిత పార్టీ ఎలా వ్యక్తికేంద్రిత ఎన్నికల యంత్రాంగంగా పరిణామం చెందిందనే రాజకీయ అధ్యయనం కూడా. అయితే దీనిలో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం ఉంది. బీజేపీ మోదీకి బలం ఇచ్చింది. కానీ మోదీ కూడా బీజేపీకి ఇంతకు ముందు లేని స్థాయిలో జాతీయ గుర్తింపు, ఎన్నికల విజయాలు తెచ్చారు.
అందుకే ఇప్పుడు చర్చ.. మోదీ బీజేపీకి ఎంత పెద్ద నాయకుడు? అన్నది కాదు. అసలు ప్రశ్న.. మోదీ తర్వాత బీజేపీ ఎలా ఉంటుంది?
అన్నదే. ఎందుకంటే ఒక నాయకుడు పార్టీకి ఫేస్ గా మారడం ఒక రాజకీయ విజయంగా కనిపించవచ్చు. కానీ ఆ నాయకుడి తర్వాత కూడా అదే పార్టీ అదే స్థాయి బలంతో కొనసాగగలదా? అన్నదే వ్యక్తి కేంద్రిత రాజకీయ వ్యవస్థకైనా పరీక్షే. మోదీ 25 ఏళ్ల ప్రయాణం ఆ ప్రశ్నను భారత రాజకీయాల ముందుంచింది.


