తెలంగాణ

Hyderabad: ఓటర్ లిస్ట్‌పై పొలిటికల్ ఫైట్.. SIRతో కాంగ్రెస్–బీజేపీ ఢీ!!..

రచన: Venu•••8 నిమిషాల పఠనం

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. SIR ప్రక్రియ పై అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. చివరికి ఈ అంశం కాంగ్రెస్–బీజేపీ మధ్య కొత్త రాజకీయ వార్‌కు కేంద్రంగా మారుతోంది.

నగరంలో నకిలీ ఫామ్-7 కలకలం

బీజేపీ బూత్ ఏజెంట్‌ ఘనకార్యం

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు ప్రయత్నం

క్రిమినల్ కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. SIR ప్రక్రియ పై అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. చివరికి ఈ అంశం కాంగ్రెస్–బీజేపీ మధ్య కొత్త రాజకీయ వార్‌కు కేంద్రంగా మారుతోంది. ఓట్ల తొలగింపు, ఫామ్‌-7 దరఖాస్తులు, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయమవుతున్నాయన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, విమర్శలు పెరుగుతున్నాయి.

మరోవైపు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా అన్న ఆందోళన ఓటర్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో అందుబాటులో లేకపోవడం, చిరునామా మార్పు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్ల నమోదులు వంటి కారణాలతో అనర్హులుగా గుర్తించే ప్రక్రియపై భిన్నమైన వాదనలు రాజకీయ పార్టీలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అర్హులైన ఓట్లే తొలగిపోతున్నాయంటూ కాంగ్రెస్ గట్టిగా ఆరోపిస్తుండగా.. ఎన్నికల జాబితా ప్రక్షాళనకు SIR తప్పని సరి అవసరమని బీజేపీ వాదిస్తోంది.

ఈ పోరు ఇలాగే సాగుతుండగా ముషీరాబాద్ నియోజకవర్గంలో వెలుగుచూసిన ఫామ్‌-7 వ్యవహారం ఆందోళనకరంగా మారింది. ముందస్తుగా నింపిన 30 ఫామ్‌-7 దరఖాస్తులతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్ ఎస్. బాలచందర్‌ ప్రయత్నించారనే ఆరోపణలపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

సెప్టెంబర్ 28న పోలింగ్ స్టేషన్ నంబర్ 210 వద్ద బీఎల్వోకు ఓటర్లు ఈ దరఖాస్తులను అందించేందుకు ప్రయత్నించగా.. అధికారులు వాటిని స్వీకరించేందుకు నిరాకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.. అయితే తప్పుడు ధ్రువీకరణలు, నకిలీ సమాచారంతో ఓటర్ల తొలగింపునకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల నేపథ్యంలో.. ముషీరాబాద్ ఈఆర్వో టి. ప్రవీణ్ కుమార్ రెడ్డి న్యాయ సలహా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో BNSలోని 217, 318(2) సెక్షన్లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్ పై కేసు నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో నకిలీ ఫామ్‌-7ల దుర్వినియోగానికి సంబంధించి నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్‌గా ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా SIRపై నిరసనలు చేపడుతుండగా.. బీజేపీ మాత్రం ఓటర్ల జాబితా శుద్ధీకరణలో భాగంగానే ఈ ప్రక్రియ జరుగుతోందని వివరించే ప్రయత్నం చేస్తుంది.

దీంతో ఇప్పుడు కాంగ్రెస్–బీజేపీ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోరుకు SIR వేదికగా మారుతోంది. ఈ క్రమంలో SIR వల్ల ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి? అందులో నిజంగా అర్హులైన ఓటర్లు ఎంతమంది? అనర్హుల పేర్ల తొలగింపుతో పాటు పొరపాటున అర్హులైన ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయాయా? అనే అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అలాగే పేర్లు గల్లంతైన ఓటర్లు తిరిగి తమ వివరాలను సరిచేసుకోవడం, అభ్యంతరాలు నమోదు చేయడం వంటి ప్రక్రియలు కూడా సవాల్‌గా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ఒకవైపు నకిలీ ఓట్లు తొలగించాలన్న డిమాండ్.. మరోవైపు అర్హులైన ఓటర్ల హక్కులు కాపాడాలన్న వాదన.. ఈ రెండింటి మధ్య ఎన్నికల యంత్రాంగానికి SIR ప్రక్రియ పెద్ద పరీక్షగా మారింది. ముఖ్యంగా ఫామ్‌-7 దుర్వినియోగం అంశం వెలుగులోకి రావడం.. కేసు కూడా నమోదు కావడంతో.. ఇకపై ఓటర్ల తొలగింపు దరఖాస్తులపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోందని తెలుస్తుంది.

మొత్తంగా తెలంగాణలో SIR పై కాంగ్రెస్–బీజేపీ మధ్య కొనసాగుతున్న ఈ వార్‌లో మున్ముందు మరిన్ని ఫామ్‌-7 వివాదాలు, నిరసనలు, ఫిర్యాదులు తెరపైకి వస్తాయా? అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 13 కోట్ల మంది ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడుతున్నారు..

ఈ అక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక SIR ప్రక్రియలో జరిగిన అవకతవకలపై నిలదీస్తూ అక్టోబర్ 6, 2026 న ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో 'ఇండియా' (INDIA) కూటమి ఎంపీలు భారీ మార్చ్‌ చేపట్టారు.

ఇందులో భాగంగా రాహుల్, ప్రియాంకలతో పాటు 300 మంది ప్రతిపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశం పై తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంటూ తోసిపుచ్చింది. బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన SIR ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు సైతం సమర్థించినట్టు CEC పేర్కొంది.

ఇక బీజేపీ నేతలు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పై ఘాటుగా స్పందిస్తూ.. ఓటమి భయంతోనే కాంగ్రెస్, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే అజెండాగా సాగుతున్న ఈ ఆరోపణల పర్వం చివరికి ఇంకెన్ని వివాదాలను మోసుకొస్తుందో.. కేంద్రం లొసుగులెన్ని బయట పెడుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది.

#Telangana SIR#Telangana Voter List#SIR Controversy#Congress BJP War#Voter Deletion#Form 7#Telangana Politics#Election Commission#Fake Form 7#Mushirabad Constituency
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి