Rahul Gandhi Arrested: దేశ రాజధానిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆకాశవాణి భవన్ ఆవరణలో దాదాపు 9 గంటల పాటు కూర్చున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు అగ్రనేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 50 మంది ఎంపీలతో పాటు సుమారు 250 మందిని పోలీసులు డిటెయిన్ చేశారు.
బారికేడ్లు ఎక్కి రాహుల్ నిరసన..
పార్లమెంట్ మెయిన్ గేట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కు ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా ఊపుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడాలతో పాటు ఇతర విపక్ష ఎంపీలు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి రోడ్డుపైనే బైఠాయించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పరుపులు వేసుకుని బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
ముందస్తు అపాయింట్‌మెంట్ అడగలేదు: ఈసీ
మరోవైపు ఈ రచ్చపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. విపక్ష నేతలు తమతో భేటీ అవుతారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు తమను కలవడానికి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ రాలేదని స్పష్టం చేసింది. 4 గంటల తర్వాతే రాహుల్ టీమ్ కలవాలనుకుంటున్నట్లు సమాచారం అందిందని, కమిషన్‌ను కలవాలంటే అధికారిక ప్రతినిధి ద్వారా ముందుగా అపాయింట్‌మెంట్ కోరితే పరిశీలించి సమయం కేటాయిస్తామని వెల్లడించింది.












