తెలంగాణ

Governor Quota MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో రసవత్తర ఫైట్! కాంగ్రెస్ పెద్దల ఫైనల్ లిస్ట్ లీక్?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

Governor Quota MLC: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగియనుండటంతో, వారి స్థానాల్లో రాజ్ భవన్‌కు పంపే పేర్లను ఖరారు చేసేందుకు అధిష్ఠానం కసరత్తు కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తుంది.

Governor Quota MLC: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగియనుండటంతో, వారి స్థానాల్లో రాజ్ భవన్‌కు పంపే పేర్లను ఖరారు చేసేందుకు అధిష్ఠానం కసరత్తు కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తుంది.

ఉన్నవి 3 సీట్లు.. కానీ రేసులో డజన్ల కొద్దీ ఆశావహులు ఉండటంతో గాంధీ భవన్ నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల దాకా ముమ్మర లాబీయింగ్ సాగుతుందనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. అయితే కేబినెట్ భేటీ వేదికగా గవర్నర్‌కు సిఫారసు చేయబోయే ముగ్గురి ఫైనల్ లిస్ట్ దాదాపు రెడీ అయ్యిందన్న లీక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు తెరలేపింది.

పక్కా సామాజిక సమీకరణాలు.. ఆ 3 వర్గాలకే మొగ్గు!

ఈసారి సీనియారిటీల కంటే పక్కా సామాజిక సమతుల్యత, రాబోయే రాజకీయ సమీకరణాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని సమాచారం. గతంలో జరిగిన కేటాయింపులను సరితూస్తూ ఈ మూడు స్థానాలను పంచేలా కాంగ్రెస్ పెద్దలు ఒక ఫార్ములాను ఫైనల్ చేశారని లీక్‌లు వైరల్ అవుతున్నాయి.

పద్మశాలి కోటా:

సిరిసిల్ల సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి బిడ్డను పెద్దల సభకు పంపుతానని బహిరంగంగా హామీ ఇచ్చారు. దీంతో చేనేత వర్గానికి ఒక స్థానం నూటికి నూరు శాతం పక్కా అయిందని అంటున్నారు.

ఎస్సీ మాదిగ కోటా:

గతంలో మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు మండలి అవకాశం దక్కింది. దీంతో ఈసారి సామాజిక న్యాయం ప్రకారం మాదిగ వర్గానికే రెండో స్థానాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు.

ఓసీ బ్రాహ్మణ కోటా:

కమ్మ సామాజిక వర్గం నుంచి గతంలో రేణుకా చౌదరికి ప్రాధాన్యం దక్కిన నేపథ్యంలో, ఈసారి ఓసీ కోటాలో సాంప్రదాయంగా కాంగ్రెస్‌తో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దల సభలో చోటు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లీకైన ముగ్గురి పేర్లు ఇవేనా?

ఈ మూడు సామాజిక వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, పైచేయి సాధించిన నేతల పేర్లతో ఒక క్లోజ్డ్ లిస్ట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది

చేనేత కోటా – ఈరవత్రి అనిల్:

ఈ రేసులో ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేత పున్నా కైలాష్ నేత, సంగిశెట్టి జగదీష్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ టికెట్‌‌ను త్యాగం చేయడం, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహిత కోటరీలో నమ్మకస్తుడిగా ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు.

మాదిగ కోటా – దొమ్మాటి సాంబయ్య వర్సెస్ సంపత్:

ఉమ్మడి వరంగల్ సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య పేరు బలంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీటు త్యాగం చేసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయనకే ఫస్ట్ ప్రియారిటీ దక్కుతుందన్న ప్రచారం ఉంది. మరోవైపు ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్ నడుపుతున్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఉద్యమ నేతలు గజ్జల కాంతం, దేవని సతీష్ పోటీ పడుతున్నప్పటికీ.. అధిష్ఠానం సాంబయ్య వైపే మొగ్గు చూపుతోందనే చర్చ జోరందుకుంది.

బ్రాహ్మణ కోటా – హర్కర వేణుగోపాల్:

ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర వేణుగోపాల్ పేరు దాదాపు లాక్ అయినట్లేనని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గాంధీ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం, ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాలు పోటీలో ఉన్న సీనియర్ నేత మల్లాది పవన్ కంటే ఆయన్ను ముందు వరుసలో నిలిపాయని చెబుతున్నారు.

రాజ్ భవన్ వద్దే అసలు ట్విస్ట్?

ఈ ఫైనల్ లిస్ట్‌కు త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అయితే గతంలో గవర్నర్ కోటా నామినేటెడ్ స్థానాల విషయంలో ఎదురైన న్యాయపరమైన, సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎంపికలో ఎలాంటి లొసుగులు లేకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది.

అభ్యర్థుల జాబితా దాదాపు లీక్ అయిందన్న వార్తలతో నామినేషన్ ఆశించి భంగపడ్డ ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతుండగా, అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాబోయే కేబినెట్ భేటీ తర్వాత ఈ ముగ్గురి పేర్లపై అధికారిక ముద్ర పడుతుందా లేక చివరి నిమిషంలో ఏమైనా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

#Telangana Politics#Telangana Congress#Governor Quota MLC
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి