National

సంచలన నివేదిక.. మహిళలపై నేరాల కేసుల్లో బీజేపీ నేతలే టాప్!

రచన: Mamatha puppala•••5 నిమిషాల పఠనం

మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో అధికార బీజేపీ (BJP)కి చెందిన వారే మొదటి స్థానంలో ఉన్నారని 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), 'నేషనల్ ఎలక్షన్ వాచ్' తమ తాజా అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించాయి.

  • దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేల అఫిడవిట్లపై ఏడీఆర్ నివేదిక

  • లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు

  • రాష్ట్రాల వారీగా పశ్చిమ బెంగాల్ టాప్, ఎనిమిదో స్థానంలో తెలంగాణ

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ప్రముఖ నేతలపై కేసులు

  • సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న రాజకీయ పార్టీలు

మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో అధికార బీజేపీ (BJP)కి చెందిన వారే మొదటి స్థానంలో ఉన్నారని 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), 'నేషనల్ ఎలక్షన్ వాచ్' తమ తాజా అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదవుల్లో ఉన్న 772 మంది ఎంపీలు, 4,109 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించగా, మొత్తం 168 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసులను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం, బీజేపీకి చెందిన ఏకంగా 95 మంది ఎమ్మెల్యేలు, 10 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ (మొత్తం 106 మంది ప్రజాప్రతినిధులు) మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను అధికారికంగా అఫిడవిట్లలో పొందుపరిచారు.

సంచలన నివేదిక.. మహిళలపై నేరాల కేసుల్లో బీజేపీ నేతలే టాప్!

దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ఇద్దరు లోక్‌సభ ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలపై ఏకంగా లైంగికదాడి కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏడీఆర్ బయటపెట్టింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఒక లోక్‌సభ ఎంపీపై మహిళా వేధింపుల కేసులు ఉండగా, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేప్ కేసులు ఉన్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ తదితర పార్టీల ప్రజాప్రతినిధులపై కూడా రేప్ కేసులు ఉన్నాయని వెల్లడైంది.

ఎనిమిదో స్థానంలో తెలంగాణ..

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, మహిళలపై నేరాల కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ (63 మంది ఎమ్మెల్యేలు, 6 గురు ఎంపీలు) మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (22 మంది), ఒడిశా (17 మంది) ఉన్నాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీపై కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, కేసులు నమోదై ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ వరుసలో ఐదుగురిపై కేసులతో (ఇద్దరు ఎమ్మెల్యేలు/ ముగ్గురు ఎంపీలు) తెలంగాణ రాష్ట్రం ఎనిమిదవ స్థానంలో ఉంది. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంలపై మహిళలకు సంబంధించిన నేరారోపణలు నమోదైనట్లు ఏడీఆర్ పేర్కొనడం సంచలనంగా మారింది.

నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి గల బలమైన కారణాలను బహిరంగంగా వెల్లడించాలని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు ఆ ఆదేశాలను పట్టించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల రక్షణ, గౌరవం గురించి మాట్లాడే రాజకీయ పార్టీల అసలు రంగును ఈ గణాంకాలు బయటపెడుతున్నాయని సామాజిక విశ్లేషకులు మండిపడుతున్నారు.

#ADRReport2026#WomenSafetyIndia#BJPMLAsCrimesAgainstWomen#PoliticalCrimesIndia#WestBengalPolitics#APPoliticsTelugu#ElectionCommissionIndia#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి