టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ బస్ పాస్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం సరికొత్త ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. రూ.600లకే అన్‌లిమిటెడ్ ‘వీక్లీ బస్ పాస్’ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్ తీసుకుని నగరంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు.
కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా 7 రోజుల పాటు ఈ పాస్ చెల్లుబాటు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు అపరిమితంగా ట్రావెల్ చేయొచ్చు. కేవలం పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ప్రస్తుతమున్న రోజువారీ, నెలవారీ పాసులకు అదనంగా ప్రయాణికులకు మెరుగైన, అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వ్యాపార పనుల నిమిత్తం, సందర్శన కోసం హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు గ్రేటర్ పరిధిలో వారం రోజుల పాటు ప్రయాణించే వారికి ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుందని సమాచారం. ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీబస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉండనున్నాయి. అవసరమైన వారు సమీపంలోని బస్‌పాస్ కౌంటర్లకు వెళ్లి కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ మేనెజ్మెంట్ ప్రకటించింది.
ప్రజారవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు నగర ప్రయాణికులకు అందుబాటు ధరలలో మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. నగరంలో వారం రోజుల పాటు ప్రయాణించాలనుకునే వారు ఈ వీక్లీ పాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


