కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయచూర్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అప్పుగా సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడనే చిన్న కారణంతో, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఒక యువకుడు కిరాణా వ్యాపారిని కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. రాయచూర్ పట్టణ పరిధిలోని ఎల్బీఎస్ నగర్, క్రౌన్ బేకరీ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్బీఎస్ నగర్‌కు చెందిన నర్సింహులు(38) అనే వ్యక్తి అక్కడ కిరాణా దుకాణం, హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన తన దుకాణం వెలుపల ఊడుస్తుండగా, గంజాయి మత్తులో ఉన్న తిలక్ సింగ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. తనకు అప్పుగా సిగరెట్ ఇవ్వాలని నర్సింహులును కోరగా, దానికి ఆయన నిరాకరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు తిలక్, తన వద్ద ఉన్న కొడవలితో నర్సింహులుపై విచక్షణారహితంగా దాడికి దిగాడు.
మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. నర్సింహులుపై కొడవలితో దాదాపు ఎనిమిది సార్లు దారుణంగా వేటు వేశాడు. ఈ తీవ్రమైన దాడిలో తీవ్ర గాయాలపాలైన నర్సింహులు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర హత్యకు సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న మార్కెట్ యార్డ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఈ సంఘటన నేటి యువతలో పెరుగుతున్న గంజాయి, మత్తు పదార్థాల వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతోందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. సరదాగా ప్రారంభమయ్యే అలవాట్లు వ్యసనంగా మారి, చివరికి అమాయకుల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ అలవాట్లు, స్నేహితులపై నిరంతరం దృష్టి సారించాలని, పోలీసులు కూడా గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


