తెలంగాణ

Telangana BJP: తెలంగాణ నేతలపై అధిష్టానం ఆగ్రహం.. పనితీరు మార్చుకుంటారా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Telangana BJP: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నేతల వ్యవహారశైలి తీవ్ర అసహనాన్ని తెప్పిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వరుస కీలక భేటీల్లో అధిష్టానం దూత సునీల్ బన్సల్ స్వరం తీవ్రంగా మారింది.

Telangana BJP: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నేతల వ్యవహారశైలి తీవ్ర అసహనాన్ని తెప్పిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వరుస కీలక భేటీల్లో అధిష్టానం దూత సునీల్ బన్సల్ స్వరం తీవ్రంగా మారింది. పార్టీ పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటూ, కేవలం ఏసీ గదులకే పరిమితమైన నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు ఈ సమావేశంతో స్పష్టమయ్యాయి. పార్టీని ముందుకు నడిపించే సత్తా లేని వారికి కీలక బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదని బన్సల్ ముఖం మీదే స్పష్టం చేయడం రాష్ట్ర నాయకత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

పదవులు కావాలి.. కానీ పనిచేయరా?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాల్సిన సమయంలో, నాయకులు అంతర్గత రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుండటంపై కేంద్రం అసంతృప్తితో ఉంది. కేవలం పదవులను అనుభవించడం తప్ప, పార్టీ ఇచ్చిన బాధ్యతలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్న వారి జాబితా అధిష్టానం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. "పనిచేసే వాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుంది.. పని చేయడం చేతకాకపోతే గౌరవంగా పక్కకు తప్పుకోండి, లేదంటే అధిష్టానమే నిర్దాక్షిణ్యంగా తప్పిస్తుంది" అని బన్సల్ నేరుగా అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యంగా టికెట్లపై కన్నేసి పదవులను అడ్డం పెట్టుకునే వారికి చెక్ పెడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ముందుగా తమ పార్టీ బాధ్యతలకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చిచెప్పడం ఆశావహులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది.

ఢిల్లీ నిఘా నీడలో తెలంగాణ నాయకులు.. తీరు మారేనా?

రాష్ట్ర నాయకుల పనితీరును ఇకపై గుడ్డిగా నమ్మే పరిస్థితిలో అధిష్టానం లేదు. నాయకులు ఏయే జిల్లాల్లో పర్యటిస్తున్నారు, ప్రజలను ఏ మేరకు కలుస్తున్నారు, కార్యక్రమాల అమలు ఎలా ఉందనే ప్రతి విషయాన్ని నిర్దేశిత నమూనాలో రాష్ట్ర కార్యాలయానికి నివేదించాల్సిందేనని గట్టి నిబంధనలు పెట్టారు. అంతటితో ఆగకుండా, పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా తానే తెలంగాణలో ఎక్కువ రోజులు మకాం వేసి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గమనిస్తానని బన్సల్ హెచ్చరించడం నేతల్లో గుబులు రేపుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులోనూ పాత పద్ధతులకు స్వస్తి పలికి, ప్రజల్లో ఉన్న ఆదరణపై సర్వేలు చేయించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు నవంబర్ 1న నగరంలో 30 వేల మందితో తలపెట్టిన భారీ పాదయాత్రే నేతల పనితీరుకు తొలి పరీక్షగా మారనుంది. అధిష్టానం విధించిన ఈ కఠినమైన డెడ్‌లైన్ తర్వాతైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ పాత తీరును మార్చుకుని ప్రజల్లోకి వెళ్తారా? లేక పదవులను కోల్పోయి పక్కకు తప్పుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Telangana BJP#BJP Telangana#Bharatiya Janata Party#Telangana BJP News#Telangana BJP Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి