Maa Inti Bangaaram: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లేడీ సూపర్ స్టార్ సమంత సరికొత్త చరిత్ర సృష్టించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం సాధించని సరికొత్త రికార్డులను ఈ సినిమా నమోదు చేస్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా, ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుండడం విశేషం.
సాధారణంగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మూడో వారం వచ్చేసరికి కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి. కానీ ‘మా ఇంటి బంగారం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మూడో వారాంతంలో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండడం సమంత స్టార్ పవర్‌కు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రానికి వస్తున్న క్రేజ్‌ను చూసి మేకర్స్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా ఘన విజయంతో ఊపుమీదున్న నిర్మాత రాజ్ నిడిమోరు.. మరో రెండేళ్లలో మా ఇంటి బంగారం చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సినీ కెరీర్‌లో ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఆలోచన రావడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. రాబోయే సీక్వెల్ సరికొత్త కథతో, డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించబోతుందని స్పష్టం చేశారు.
కాగా, సంతోష్ నారాయణన్ అందించిన అదిరిపోయే సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు తమ నటనతో మెప్పించారు. మొత్తానికి సమంత వన్-మెన్ షోగా నిలిచిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.












