సాగు నీరు ఇవ్వకుండా రైతులను ఎండబెట్టి వారిని ఇబ్బందులకు గురిచేయాలని రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనకు వెళ్తున్న ఆయనను పోలీసులు జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం పెట్టుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటనను అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు.
కన్నెపల్లి దగ్గర ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందన్నారు. వర్షాలు లేక, నీళ్లు లేక రైతులకు నాట్లు వేసే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రభుత్వ దుర్మార్గపూరిత వైఖరిని రైతాంగానికి కళ్లారా చూపించడానికే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సందర్శన కోసం వెళ్తున్నామన్నారు.తెలంగాణను సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను డిజైన్ చేశారని, కానీ సర్కార్ అందుకు విరుద్ధంగా వెళ్తుందన్నారు. ఆ నిజాన్ని ప్రజల ముందు పెట్టేందుకే కన్నెపల్లికి వెళ్తుంటే అడ్డుకుంటున్నాని, ప్రభుత్వానికి అంత భయం ఎందుకో అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి దమ్ముంటే, చేతనైతే మంచి పనులు చేసి ప్రజల ముందుకొచ్చి గెలవాలని సవాల్ విసిరారు.ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కన్నెపల్లికి వెళ్లి చూపిస్తామని స్పష్టంచేశారు. కన్నెపల్లి వద్ద ఉన్న నీళ్లను రేవంత్ సర్కార్ ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు.












