నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇటీవల వైద్యశాఖలో 6 వేలకు పైగా పోస్టులు, శనివారం పోలీసుశాఖలో 5వేల పోస్టులు ప్రకటించిన రేవంత్ సర్కార్..తాజాగా మరో 2 వేలకు పైగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు ప్రకటించింది. మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.
రెండ్రోజుల కిందట 5 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వగా.. తాజాగా మరో 2,437 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 7,437 పోస్టులలో వివిధ విభాగాలకు చెందిన ఖాళీలు ఉన్నాయి. అందులో ఫైర్ డిపార్ట్‌మెంట్ 790 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు, పోలీస్ శాఖలోని ఇతర విభాగాల్లో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియను చేపట్టనుంది.అర్హత కలిగిన అభ్యర్థులు సిలబస్, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని సూచించింది.












