బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన రణరంగంగా మారింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బయలు దేరిన ఆయన్ను జనగాం పెంబర్తి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి మరి ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు కిందకు దిగి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ కేడర్, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే, కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన కోసం కేటీఆర్ వెంట వెళ్లిన బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రమాదానికి గురయినట్టు తెలిసింది.ఆయనకు ఛాతి భాగంలో బలమయిన గాయం కావడంతో తీవ్రనొప్పితో అల్లాడిపోయినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను వెంటనే కొంపల్లి కిమ్స్ కు తరలించినట్టు తెలుస్తోంది.ఆ సమయంలో ఎమ్మెల్సీ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నట్టు సమాచారం.












