బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు.. జనగాం జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.ఆదివారం ఉదయం కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కోసం హైదరాబాద్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. ఆయన వెంట భారీ కాన్వాయ్‌తో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉండగా.. పోలీసులు హైవేపై పలుచోట్ల వాటిని నిలిపివేశారు.పెంబర్తి వద్దకు చేరుకోగానే బారికేడ్లు ఏర్పాటు చేసి కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకున్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనను అకారణంగా ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ సహా బీఆర్ఎస్ కీలక నేతలు వాహనాల నుంచి దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా వెళ్తుంటే అడుగడుగునా బారికేడ్లు అడ్డం పెట్టుడు ఏందని కేటీఆర్ ప్రశ్నించారు.కేటీఆర్‌ను అడ్డుకున్నారని తెలియడంతో జనగాం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో పెంబర్తి బారికేడ్ల వద్దకు చేరుకుంటున్నట్టు సమాచారం. గులాబీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.












