తెలంగాణ

RythuDiscom: ఉచిత విద్యుత్తుకు పాతరేసే కుట్ర: సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'రైతు డిస్కమ్' (జీవో 17) నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సహా రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న తీవ్ర అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'రైతు డిస్కమ్' (జీవో 17) నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సహా రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న తీవ్ర అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, నాణ్యమైన కరెంట్ అందించకుండా రైతుల మెడకు ఉచ్చు బిగించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిరంకుశ, దుర్మార్గపు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

 ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ పరిధిలోకి ఏకంగా 30,60,861 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, 512లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, తాగునీటి సరఫరా కనెక్షన్లతో కలిపి మొత్తం 30,62,853 కనెక్షన్లను బదిలీ చేశారని హరీశ్ రావు తెలిపారు. సుమారు 6.15లక్షల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్న ఈ భారీ ప్రజా వ్యవస్థను కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా నిర్వహించడం సాధ్యమవుతుందని నిలదీశారు.

 ఇప్పటికే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పట్టించుకునే దిక్కు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఈ కొత్త నిర్ణయం వల్ల మరింత నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ కొత్త డిస్కమ్‌కు కేటాయించిన విద్యుత్ వాటాలపై సాంకేతికపరమైన తీవ్ర సందేహాలను హరీశ్ రావు వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కేవలం 25శాతం థర్మల్ విద్యుత్‌ను కేటాయించి, 58శాతం సోలార్ పవర్‌ను కేటాయించడం దారుణమన్నారు.

 సోలార్ విద్యుత్ కేవలం పగటిపూట మాత్రమే లభ్యమవుతుందని, రాత్రివేళల్లో రైతులను చీకట్లోకి నెట్టివేసేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. ఇంకా 2325 మెగావాట్ల జల విద్యుత్ (హైడల్) కేటాయించినప్పటికీ, అది ఏడాదిలో కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే లభిస్తుందని, మిగిలిన 8నెలలు రైతు డిస్కమ్‌కు విద్యుత్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఈ కొత్త డిస్కమ్‌కు భారీ రుణ భారాన్ని, బకాయిలను కేటాయించి రేపు నష్టాల సాకుతో ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని హరీశ్ రావు హెచ్చరించారు.

 ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోందని, అదేవిధంగా ఉద్యోగుల బదిలీపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం ఎందుకు చేయలేదని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమైతే ఉచిత విద్యుత్ కొనసాగింపుపై, 24గంటల సరఫరాపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులు, విద్యుత్ నిపుణుల సందేహాలను నివృత్తి చేయకుండా, ప్రభుత్వ ఖజానాలోని ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించకుండా ముందుకు వెళ్లడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతు డిస్కమ్ జీవో 17ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

#HarishRaoBRS#TelanganaRythuDiscom#FreeElectricityTS#GO17Telangana#RevanthReddyGovt#TelanganaFarmers#BRSNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి