KTR: తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. కోర్టుకు ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ లో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. ఇక, కేటీఆర్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు త్వరలో విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఛార్జిషీటులో కేటీఆర్ ను ఏ1 నిందితునిగా చేర్చారు. 55 కోట్ల రూపాయల హెచ్ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న అభియోగాలు కేటీఆర్ పై ఉన్నాయి. ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిన నేపథ్యంలో ఏసీబీ ఛార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా ఏసీబీ ఛార్జిషీటులో నిందితుల లిస్టు నుంచి తన పేరును తొలగించాలంటూ కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ వేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్ పై విచారణ అనంతరం కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.


