International

Ukraine: జెలెన్‌స్కీకి బిగ్ షాక్.. ఉక్రెయిన్ నయా లీడర్ ఇతనేనా?

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

Ukraine: ఉక్రెయిన్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రష్యాతో నాలుగేళ్లకు పైగా సాగుతున్న హోరాహోరీ యుద్ధం మధ్యలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కుర్చీ కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెలెన్‌స్కీ స్థానంలో సరికొత్త నాయకుడు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే తన మనసులోని మాటను బయటపెట్టడంతో, కీవ్‌లో అధికార మార్పిడిపై జోరుగా చర్చ మొదలైంది.

Ukraine: ఉక్రెయిన్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రష్యాతో నాలుగేళ్లకు పైగా సాగుతున్న హోరాహోరీ యుద్ధం మధ్యలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కుర్చీ కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెలెన్‌స్కీ స్థానంలో సరికొత్త నాయకుడు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే తన మనసులోని మాటను బయటపెట్టడంతో, కీవ్‌లో అధికార మార్పిడిపై జోరుగా చర్చ మొదలైంది. ఒకప్పుడు 73 శాతం ప్రజాదరణతో గద్దెనెక్కిన జెలెన్‌స్కీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ సైన్యాధిపతి వలెరీ జలుజ్నీ దూసుకువస్తున్నారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు..

కీవ్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'రేటింగ్ గ్రూప్' నిర్వహించిన తాజా సర్వే వివరాలు జెలెన్‌స్కీ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ సైనికాధికారి వలెరీ జలుజ్నీకి ప్రజల్లో ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఏకంగా 64 శాతం మంది ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. 2022 రష్యా దండయాత్ర సమయంలో రాజధాని కీవ్‌ను అద్భుతంగా కాపాడటమే కాకుండా, రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో 40 శాతాన్ని వెనక్కి లాక్కున్న వ్యూహకర్తగా జలుజ్నీకి సైన్యంతో పాటు ప్రజల్లోనూ బలమైన ఇమేజ్ ఉంది. ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్న కారణంతో ఆయన్ను సైనిక పదవి నుంచి తప్పించినప్పటికీ, దేశంలో మాత్రం ఆయన క్రేజ్ రవ్వంత కూడా తగ్గలేదని తాజా సర్వే స్పష్టం చేస్తోంది.

పడిపోతున్న జెలెన్‌స్కీ గ్రాఫ్..

మరోవైపు జెలెన్‌స్కీ అధికారం చట్టబద్ధంగా 2024తోనే ముగిసింది. యుద్ధం, మార్షల్ లా కారణంగా పదవిలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ప్రజాభిప్రాయం క్రమంగా క్షీణిస్తోంది. తాజా సర్వేలో జెలెన్‌స్కీపై 53 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, 40 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది. ట్రంప్‌తో పొసగని సంబంధాలు, సుదీర్ఘ యుద్ధంతో విసిగిపోయిన ప్రజలు, అంతర్గత అవినీతి ఆరోపణలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకుంటే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం ఆయనకు ఏమాత్రం అనుకూలంగా లేవు.

రేసులో నిఘా చీఫ్, రక్షణ మంత్రులు

జలుజ్నీతో పాటు సైనిక గూఢచర్య విభాగం మాజీ అధిపతి కిరిలో బుడనోవ్ (53% ఆమోదం), సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రక్షణ మంత్రి మైఖైలో ఫెడొరోవ్ కూడా జెలెన్‌స్కీకి బలమైన ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోపై 70 శాతం మంది అవిశ్వాసం వ్యక్తం చేయడంతో పాత నాయకులకు అవకాశాలు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ట్రంప్ వ్యూహాలు, యుద్ధ పరిస్థితుల నడుమ జెలెన్‌స్కీ తన కుర్చీని కాపాడుకుంటారా.. లేక అమెరికా సపోర్ట్‌తో జలుజ్నీ ఉక్రెయిన్ నూతన సారథిగా పగ్గాలు చేపడతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

#Ukraine News#Volodymyr Zelenskyy#Valerii Zaluzhnyi#Donald Trump#Ukraine Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి