TG: ఒక్క అడుగు తవ్వలేదు.. ఒక్క ఇటుక పేర్చలేదు.. కానీ మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అంచనా వ్యయం మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శంకుస్థాపన దశలోనే ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేయడం వెనుక రూ.250 కోట్ల గోల్‌మాల్ దాగుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనులు మొదలుకాకముందే అంచనాలు పెంచడం వెనుక ఉన్న మతలబేంటని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
రూ.700 కోట్లు కాస్తా రూ.1,100 కోట్లకు?
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలను బయటపెడుతూ దాసోజు శ్రావణ్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టును మొదట దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టాలని భావించారని, కానీ అధికారికంగా జీవో వెలువడేసరికి లెక్కలు పూర్తిగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. కేవలం ఆలయ నిర్మాణానికే ఏకంగా రూ.948.65 కోట్లు కేటాయించారని, దీనికి అనుబంధంగా రోడ్డు విస్తరణ, ఇతర పనులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,108.27 కోట్లకు చేర్చారని ఆయన లెక్కలు వెల్లడించారు. ఒక్క పని కూడా మొదలుకాకుండానే, కేవలం ఆలయానికే దాదాపు రూ.250 కోట్ల మేర అంచనాలు ఎందుకు పెరిగాయని శ్రావణ్ ప్రశ్నించారు. ఇంత భారీగా వ్యయాన్ని అమాంతం పెంచడం వెనుక ఏ కాంట్రాక్టర్ కడుపు నింపే ప్రయత్నం జరుగుతోందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
బహిరంగ విచారణకు డిమాండ్
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించే శాఖలోనే ఈ అడ్డగోలు పెంపు జరగడంపై దాసోజు శ్రావణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆఖరికి మహాదేవుడి పేరిట కూడా దోపిడీ చేస్తారా? దేవాలయాల పేరుతో అంచనాల దందా నడుపుతారా?" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఎవరి జేబులు నింపడానికో ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని నిలదీశారు. ఓంకారేశ్వర ఆలయ అంచనాల పెంపు ఆరోపణలపై తక్షణమే బహిరంగ విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాసోజు శ్రావణ్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


