విజయవాడ బైపాస్ రోడ్డులో నడిరోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బైపాస్ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఈవీ కారు అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. వెంటనే కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా క్షణాల వ్యవధిలోనే దగ్ధమైంది. ఇక కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఈ దుర్ఘటనలో సజీవ దహనమవడం పలువురుని కలిచివేసింది.
వీరంతా గుంటూరు జిల్లా నంబూరులోని ఓ ఫంక్షన్‌కు హాజరై, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు ఈ ప్రమాద సమయంలో మొత్తం ఐదుగురు కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నలుగురు మంటల్లో చిక్కుకుని మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు వెంటనే స్పందించి, తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని మంటల బారి నుంచి బయటకు లాగారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇక మృతులంతా గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని విజయవాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఒక్క క్షణం ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ మనసును ఊరకలెత్తించేలా వేగంగా చేసే ప్రయాణం తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ ఇలా జరగరాని ఘొరం జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయి.. మట్టిలో కలిసిన ప్రాణం మళ్ళీ తిరిగిరాదు.. అందుకే ప్రాణాంతకమైన వేగం కంటే ప్రాణం మిన్న అనే విషయాన్ని అధికారులు తెలియచేస్తున్నా ఏ డోంట్ కేర్ అంటూ బలవుతున్న వాళ్ళు ఇకనైనా మీ భార్య బిడ్డలను, కన్న తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకుని వాహనాలు నడపండి.


