తెలంగాణ

jagityala: రష్యా డ్రోన్ దాడిలో తెలంగాణ వాసి మృతి.. కుటుంబానికి రూ.6 లక్షల సాయం ప్రకటించిన సీఎం!

రచన: Venu••5 నిమిషాల పఠనం

ఓ యువకుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి యుద్ధానికి బలయ్యాడు. చివరికి కన్న కొడుకును కోల్పోయిన ఆ తల్లికి, భర్తను కోల్పోయిన భార్యకు తీరని దుఃఖం మిగిలింది. మరోవైపు, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి నెల రోజులకు పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓ యువకుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి యుద్ధానికి బలయ్యాడు. చివరికి కన్న కొడుకును కోల్పోయిన ఆ తల్లికి, భర్తను కోల్పోయిన భార్యకు తీరని దుఃఖం మిగిలింది. మరోవైపు, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి నెల రోజులకు పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు చూస్తే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా వాసి వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.

బాధిత కుటుంబానికి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే గత నాలుగు నెలల క్రితం జగిత్యాల అర్బన్ మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ ఉపాధి కోసం ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఆయన ప్రాణాలను బలిగొన్నాయి. సెప్టెంబర్ 1న రష్యా దాడిలో సుదర్శన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన మరణవార్తతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇక చివరి సారిగా కన్న కొడుకును చూడాలని తల్లి, కట్టుకున్న భర్తను చూడాలని అతని భార్య ఆశపడ్డారు.. అలాగే అతని అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించాలన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే, సుదర్శన్ మృతి చెంది 39 రోజులు గడిచినా ఆయన భౌతికకాయం స్వదేశానికి చేరలేదు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఆరు లక్షల రూపాయలు అవసరమని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇప్పటికే అవసరమైన పత్రాలు, ఇతర ప్రక్రియల కోసం సహాయం కోరుతూ మృతుని భార్య భార్గవి రాయబార కార్యాలయానికి వినతిపత్రం సమర్పించినా స్పందన రాలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న భార్గవి, మృతుని తల్లి గంగు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. వారి సమస్యను తెలంగాణ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన మార్గదర్శకత్వం అందించారు.

ప్రజావాణి హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరుతూ లేఖ రాశారు. వీరి విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక యుద్ధం కారణంగా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం కొంత ఊరటనిచ్చినా, తమ ఆత్మీయుడి భౌతికకాయం స్వగ్రామానికి చేరి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వారి నిరీక్షణ మాత్రం కొనసాగనుంది...

#Russia Ukraine War#Jagtial News#Sudarshan Goud#Telangana Government#Revanth Reddy#CM Relief Fund#Indian Embassy Ukraine#Telangana NRI News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి