ప్రతిరోజు కయ్యమే అంటే... ప్రజలకు కూడా అసహ్యమే.. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ తీరు చూస్తుంటే సామాన్యుల నుంచి వస్తున్న ప్రధానమైన అభిప్రాయం ఇదే అని తెలుస్తుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆలోచన లేదు... ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు పదునైన వ్యూహం లేదు... మధ్యలో ఉన్న బీజేపీకి సరిపడా బలం లేదు. అసలు తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఓ దిశా నిర్దేశమే లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు, బీజేపీ బలహీనతల మధ్య ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోవడం. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆస్తుల పంచాయితీలు, పాత కేసుల ప్రస్తావనలతో రాజకీయాలు మతితప్పినట్టు సాగుతున్నాయని అంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో రైతులకు నీళ్లు, ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్, ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలకు మాత్రం ఆశించిన ప్రాధాన్యం కనిపించడం లేదని రాష్ట్ర సగటు జీవి వాపోతున్నాడు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య జరిగే రాజకీయ పోరాటం ఇలాగే కొనసాగితే మూడో పార్టీ బీజేపీకి అవకాశంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా అధికార కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించే ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వ్యవహారాలతో పాటు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్‌కు వేలాది ఎకరాలు ఎలా వచ్చాయి? కేటీఆర్, హరీశ్‌రావు ఆస్తులు ఎలా సంపాదించారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగితే వాటిని ఆధారాలతో సహా నిరూపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఏళ్ల తరబడి ఆరోపణలతో ప్రజా ధనాన్ని వృధా చేస్తూ తామే తోపులమని ప్రవర్తిస్తుంటే.. జనం చీదరించుకుంటారనే వాదన వినిపిస్తుంది. అలాగే ప్రజలకు స్పష్టమైన ఫలితాలు కనిపించకపోతే ప్రభుత్వంపైనే ప్రశ్నలు మొదలవుతాయి.
కేసులు, విచారణలు, అరెస్టుల గురించి ప్రకటనలు చేయడం కంటే నేరాలు నిరూపించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడమే పార్టీ పై ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో ఇంకా ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు ఏటా 15 వేల రూపాయల రైతు భరోసా, పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు, ఇతర హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ, మిగిలిన హామీల విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక మహిళా సంఘాలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిదే. కానీ వాటితోనే సంక్షేమ పాలన పూర్తయినట్లు కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళలకు ఏటా చీరలు పంపిణీ చేసింది. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది చీరలకంటే ఎక్కువగా ఆర్థిక భరోసా, ఉపాధి, సంక్షేమ హామీల అమలు అన్న విషయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదనే విమర్శలున్నాయి.
అదేవిధంగా రైతు అంశాలు కూడా మరింత కీలకంగా మారాయి.. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు, సాగునీటి లభ్యత, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, గోదావరి జలాల వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నీళ్లు, విద్యుత్, తాగునీరు ప్రజల ప్రాథమిక అవసరాలు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో సాధించిన పురోగతిని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు.
అలాగే గతంలో ఎదురైన కరువులు, విద్యుత్ కోతలను కూడా మర్చిపోలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి సమస్యలు తిరిగి రాకుండా చూడాలని ఆశిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణలు ఒకవైపు కొనసాగుతుండగా, ప్రస్తుత నీటి అవసరాలను తీర్చే చర్యలు మరోవైపు సమాంతరంగా సాగాలి. గత ప్రభుత్వ తప్పిదాలపై విచారణ పేరుతో ప్రస్తుత పాలన బాధ్యతలను విస్మరించడానికి వీల్లేదని పాలకులు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే.. గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ, కాంగ్రెస్ తన రాజకీయ చర్చలో ఎక్కువ సమయం బీఆర్ఎస్‌పైనే కేటాయిస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో బలపడుతోందని విశ్లేషకులు అంటున్నారు.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే.. కాంగ్రెస్ తిట్టినంత మాత్రాన బీఆర్ఎస్ బలహీనపడదు.
ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించాలా, మళ్లీ ఆదరించాలా అన్నది వారి వ్యవహార శైలి, పనితీరు, రాజకీయ వైఖరి, భవిష్యత్తు కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ కూడా గత పదేళ్ల పాలనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడంతోపాటు, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత సమస్యలపై నిరంతర పోరాటం చేయాలి. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. ప్రత్యామ్నాయ విధానాలను చూపించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..
ఇక బీజేపీ విషయానికి వస్తే.. తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీకి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాన్ని నిలదీసేంత స్థాయిలో ఐక్యత, నిరంతర పోరాటం కమల దళంలో కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ నాయకత్వం ఐక్యంగా పనిచేయాలని సూచిస్తున్నా, రాష్ట్ర స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆస్తుల ఆరోపణలు, పాత కేసుల చర్చలు కొనసాగుతున్న సమయంలో బీజేపీ ప్రజా సమస్యలపై బలమైన కార్యాచరణతో ముందుకొస్తే రాజకీయంగా లాభపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను విమర్శించడం మాత్రమే సరిపోదు. నీటి సమస్యలు, రైతుల కష్టాలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలుపై స్పష్టమైన ప్రత్యామ్నాయాలను ప్రజల ముందు ఉంచాలి.
అదేవిధంగా తెలంగాణలో పార్టీలు కూడా తమ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది. సామాజిక న్యాయం, బీసీ రాజ్యాధికారం వంటి అంశాలను ముందుకు తెస్తున్నా, వాటిని ఆచరణలోకి తీసుకెళ్లే కార్యాచరణ, ప్రజల్లో విస్తృత ఆదరణ సాధించే బలం ఎంతవరకు ఉందన్నది తేలాల్సి ఉంది. అలాగే కవిత రాజకీయంగా ఏ పార్టీని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతారన్న దానిపై కూడా స్పష్టత అవసరం. కొత్త పార్టీకి నినాదం మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజలతో అనుబంధం, క్రమబద్ధమైన పోరాటం, నమ్మదగిన నాయకత్వం అవసరమని అంటున్నారు.. అలా కాదని టామ్ అండ్ జెర్రీ రాజకీయాలు చేస్తే మున్నాళ్ళ ముచ్చట గానే పార్టీ పరిస్థితి ఉంటుందని అంటున్నారు..
ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది.. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానిది. అయితే ఈ పోరాటం అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం చుట్టూ సాగాలి. కానీ బీఆర్ఎస్ ఆస్తులు, కేసీఆర్ ఫామ్‌హౌస్, కేటీఆర్ ఆస్తులు, హరీశ్‌రావు ఆస్తులపై ఆరోపణలు చేస్తూ ఏళ్ల తరబడి సమయాన్ని గడిపితే ప్రజలకు ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు జనంలో పుడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అంతిమంగా, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఎవరిని ఇంటికి పంపించాలి అన్నది నాయకుల నిర్ణయం కాదు.. ప్రజల తీర్పు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మేలు జరిగితేనే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. బీఆర్ఎస్ గత తప్పిదాలకు సమాధానం చెప్పి, ప్రజల సమస్యలపై పోరాడితేనే తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడి, ఐక్యతను ప్రదర్శించి, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తేనే తెలంగాణలో బలపడగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అలా కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ప్రజా సమస్యలను పక్కన పెడితే.. ఆ రాజకీయ శూన్యతను మరో పార్టీ భర్తీ చేసే అవకాశం ఉంది. రెండు కోతులు రొట్టె కోసం కొట్లాడుతుంటే మూడోది లాభపడినట్లుగా, కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నిరంతర రాజకీయ కయ్యం బీజేపీకి అనుకోని అవకాశాన్ని కల్పించవచ్చు. అయితే కమలం వికసించడం ఖాయమని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.
ఎందుకంటే తెలంగాణకు కావాల్సింది ఆరోపణల రాజకీయం కాదు.. హామీల అమలు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం, జవాబుదారీ పాలన, ప్రజల జీవితాల్లో కనిపించే అభివృద్ధి.. ఈ విధానాన్ని ఎవరు సరిగా అమలు చేస్తే వాళ్ళ రాజకీయ అధికారాలకు ఢోకా ఉండదని వివరిస్తున్నారు.. అలాగే పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోవాలి... ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పోరాటాలు చేయాలి. లేదంటే సమయం వచ్చినప్పుడు ప్రజలే సరైన తీర్పునిచ్చి తగిన పాఠం చెబుతారు.


