National

GenZ Protest: జెన్-జీ పోరాటాన్ని 'కుట్ర' అనడం న్యాయమా?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

GenZ Protest: దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్డెక్కితే చాలు.. వారి వెనుక ఏదో అదృశ్య హస్తం ఉందని, విదేశీ శక్తుల ప్రోద్బలం దాగుందని ముద్ర వేయడం పాలకులకు పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా చదువు, కొలువు, ఈఎంఐల చక్రబంధంలో బతికేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్న 'జెన్-జీ' తరం ఒక్కసారిగా ప్రశ్నించేసరికి.. దానికి రాజకీయ కుట్రల రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ ?

GenZ Protest: దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్డెక్కితే చాలు.. వారి వెనుక ఏదో అదృశ్య హస్తం ఉందని, విదేశీ శక్తుల ప్రోద్బలం దాగుందని ముద్ర వేయడం పాలకులకు పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా చదువు, కొలువు, ఈఎంఐల చక్రబంధంలో బతికేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్న 'జెన్-జీ' తరం ఒక్కసారిగా ప్రశ్నించేసరికి.. దానికి రాజకీయ కుట్రల రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ ? కళ్లెదుట భవిష్యత్తు నాశనమవుతుంటే రోడ్డెక్కిన నిస్సహాయ యువత ఆక్రందనను 'వ్యవస్థలపై దాడి'గా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ఆవేదనకు 'కుట్ర' రంగు ఎందుకు?

నీట్ పరీక్షల నిర్వహణలో డొల్లతనం బయటపడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడినప్పుడు వారు మొదట కోరింది ఒక్కటే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వ్యవస్థాగత సంస్కరణలు. ఎవరి పదవులూ ఊడగొట్టాలని, ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఎవరూ రోడ్డెక్కలేదు. పాతికేళ్లుగా దేశంలో పేపర్ లీకేజీలు ఆగకపోవడం, సీబీఎస్ఈ పేపర్ల మూల్యాంకనంలో ఘోర లోపాలు కమిటీల సాక్షిగా నిరూపితమైనా దిద్దుబాటు లేకపోవడం, వీటికితోడు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులపై నేతలు పరిహాసాలాడటం.. ఇవన్నీ యువత సహనాన్ని పరీక్షించాయి.

సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, ఆందోళనల వెనుక కొన్ని శక్తులున్నాయని ప్రచారం చేయడం ద్వారా పాలకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. తమ రక్తమాంసాలతో రాసిన పరీక్షల ఫలితాలు మోసపూరితంగా మారుతుంటే గొంతు ఎత్తడం నేరమా? ప్రజాస్వామ్యంలో పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును 'కుట్ర'గా వక్రీకరించడం అసలైన దుర్మార్గం.

పొరుగు దేశాల అరాచకంతో పోలిక సరికాదు

జెన్-జీ ఉద్యమం తెరపైకి రాగానే కొందరు పనిగట్టుకుని పొరుగు దేశాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిన హింసాత్మక విప్లవాలతో పోల్చి భయాందోళనలు సృష్టిస్తున్నారు. కానీ భారతీయ విద్యార్థుల నైజం అది కాదు. ఇక్కడి ఉద్యమకారులు ఎక్కడా అరాచకత్వానికి తావివ్వలేదు. తమ ఉద్యమానికి మద్దతు పలకడానికి వచ్చిన రాజకీయ నాయకులను సైతం నిక్కచ్చిగా వెనక్కి పంపిన చరిత్ర వీరిది.

తమది ఏ రాజకీయ పార్టీకో, సర్కారుకో వ్యతిరేక పోరాటం కాదని, కేవలం వ్యవస్థల డొల్లతనాన్ని ప్రశ్నించే పోరాటమని వారు స్పష్టంగా చాటిచెప్పారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై పారదర్శకత అడిగినా, విద్యా విధానంలో లొసుగులను నిలదీసినా.. అది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికే తప్ప కూల్చడానికి కాదని చెబుతున్నారు. ఇంతటి పరిణతి కనబరుస్తున్న యువతపై 'జాతి వ్యతిరేకులు' అనే ముద్రలు వేయడం ఆ తరానికి చేసే తీరని ద్రోహం అని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్బంధం తాత్కాలికమే.. ప్రశ్నే శాశ్వతం

జంతర్ మంతర్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో భారీ బలగాలను మొహరించి, విద్యార్థులను అడుగు బయటపెట్టకుండా అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోదు. ప్రశ్నించే గొంతును బూట్ల కింద తొక్కేయాలనుకోవడం నియంతృత్వ పోకడే అవుతుంది. పోలీసుల లాఠీలు, అక్రమ అరెస్టులతో అసంతృప్తిని తాత్కాలికంగా అణచివేయగలరేమో కానీ, గుండెల్లో రగిలే ఆవేదనను ఆపలేరు. పైగా ఇలాంటి మొండివైఖరి సాధారణ ప్రజలను, నిష్పక్షపాతంగా ఉండే తటస్థులను కూడా ఆగ్రహంతో ఉద్యమబాట పట్టేలా చేస్తుందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

భారత రాజకీయాల్లో నేడు తిరుగులేని నాయకులుగా ఉన్న ఎందరో మహానుభావులు ఒకనాడు యువతగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై పోరాడి, రోడ్లపై దెబ్బలు తిని ఎదిగినవారే అని గుర్తుకు ఉంచుకోవాలని చెబుతున్నారు. ఆనాడు ప్రశ్నించిన వాళ్లు దేశభక్తులైతే.. ఈనాడు తమ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తున్న జెన్-జీ కుట్రదారులు ఎలా అవుతారు? అని ప్రశ్నిస్తున్నారు.

యువత ఆక్రందన వెనుక ఉన్నది కుట్ర కాదు, వ్యవస్థల నిర్లక్ష్యంపై పుట్టిన స్వచ్ఛమైన తిరుగుబాటు. వారి డిమాండ్లలో ఉన్న న్యాయాన్ని గుర్తించి, సమస్యల మూలాలపై చికిత్స చేయడమే నిజమైన రాజనీతిజ్ఞత అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రశ్నించే తరాన్ని శత్రువులుగా కాకుండా, దేశాన్ని ముందుకు నడిపించే చోదకశక్తిగా గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం దక్కుతుందని హితవు పలుకుతున్నారు.

#GenZ Protest#జెన్ జీ ఉద్యమం#విద్యార్థుల ఆందోళనలు#యువత నిరసనలు#NEET వివాదం#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి