క్యాన్సర్తో పోరాడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. అత్యంత కీలకమైన, ఖరీదైన 137రకాల క్యాన్సర్ నిరోధక ఔషధాల (Anti-Cancer Drugs) ప్రాథమిక ధరలపై ట్రేడ్ మార్జిన్ను (Trade Margin) గరిష్టంగా 30శాతానికి పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే ప్రధాన క్యాన్సర్ మందుల గరిష్ట చిల్లర ధరలు (MRP) ఏకంగా 70శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
ఈ సవరించిన నూతన ధరలు నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అక్టోబర్ 17న డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్-2013లోని పారా 19 నిబంధనలను అనుసరించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన నిబంధన ప్రకారం.. ఔషధ తయారీదారు (Manufacturer) నుంచి చివరి వినియోగదారుడికి (Patient) చేరే క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, రిటైల్ ఫార్మసీల లాభాల మార్జిన్ మొత్తం కలిపి 30 శాతానికి మించకూడదు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులతో నివోలుమాబ్, బెవాసిజుమాబ్, అటెజోలిజుమాబ్, ఓలపారిబ్ వంటి అత్యంత ఖరీదైన పేటెంట్, జనరిక్, దేశీయ, దిగుమతి చేసుకునే 137మందులను ఈ పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల దేశంలో క్యాన్సర్ బాధితులకు ఏటా దాదాపు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక ఆదా లభిస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో క్యాన్సర్ చికిత్సకు అయ్యే విపరీతమైన మందుల వ్యయంపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
2019లో కూడా 42 రకాల క్యాన్సర్ మందులపై ఇదే తరహాలో ట్రేడ్ మార్జిన్ క్యాపింగ్ విధించి ధరలను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. ఈ నిర్ణయం అమలుతో బ్రాండెడ్, దిగుమతి చేసుకునే మందుల విక్రయదారులు కూడా పరిమితులకు లోబడి వ్యాపారం చేయాల్సి ఉంటుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం, అన్ని ప్రముఖ ఔషధ తయారీదారులు రాబోయే 7 రోజుల్లోగా సవరించిన ధరల జాబితాను (Revised Price List) ఎన్పీపీఏకి సమర్పించడంతో పాటు తమ అధికారిక వెబ్సైట్లలో ప్రచురించాల్సి ఉంటుంది. ఆసుపత్రులు, ఫార్మసీలు సవరించిన తక్కువ ధరలకే మందులను విక్రయించేలా రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


