భారత సంతతికి చెందిన విదేశీ పౌరసత్వం కలిగిన (OCI) యువ క్రికెటర్లకు బాంబే హైకోర్టు కీలక సూచనలు చేసింది. భారత్కు ప్రాతినిధ్యం వహించాలనే బలమైన తపన ఉంటే, ముందుగా భారత పౌరసత్వం (Indian Citizenship) తీసుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. బీసీసీఐ (BCCI) నిర్వహించే దేశవాళీ టోర్నమెంట్లలో పాల్గొనాలంటే భారత పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 12మంది ఓసీఐ కార్డు కలిగిన యువ క్రికెటర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ యువ క్రీడాకారులు భారత్లోనే నివసిస్తూ ఇక్కడే చదువుకుంటున్నారని, కేవలం దేశవాళీ టోర్నమెంట్లలో ఆడేందుకు అనుమతి ఇస్తే భవిష్యత్తులో ఐపీఎల్ (IPL) ఆడేందుకు అర్హత సాధిస్తారని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొరత లేదు.. దేశం తరఫున ఆడాలని అంతగా భావిస్తుంటే భారత పౌరసత్వం ఎందుకు తీసుకోకూడదు?’ అని నేరుగా ప్రశ్నించింది.
ఓసీఐ హోదాలోనే కొనసాగాలా? లేక భారత పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలా? అనేది వారే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అటు బీసీసీఐ తరఫు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. పౌరసత్వ చట్టాల ప్రకారం ఓసీఐ కార్డుదారులు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి లేదని, బోర్డు టోర్నీల్లో పాల్గొనడాన్ని ఒక హక్కుగా భావించలేరని స్పష్టం చేశారు.
2023లో బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకురాకముందు వరకు తాము దేశవాళీ క్రికెట్ ఆడగలిగామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పిటిషన్ వేసిన క్రీడాకారుల పౌరసత్వ దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి (Status) పై నివేదిక సమర్పించాలని బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్లను ఆదేశించింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండటంతో, కేసు తదుపరి విచారణను నవంబర్ 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


