వైద్యం అనేది సేవారంగం.. కానీ నేడు వ్యాపార రంగంగా మారిందనే తీవ్ర ఆరోపణలున్నాయి.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో సర్కార్ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్న అక్కడ ఉన్న అరకొర వసతుల వల్ల పేద వారు సైతం ఒక్కోసారి ప్రైవేయిట్ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.. అయితే అన్నీ వర్గాల వారికి అందుబాటులో ఉండవలసిన వైద్యం నేడు కొన్ని వర్గాల వారికే పూర్తి స్థాయిలో అది సంపన్న వర్గాల వారే అందుబాటులోకి వచ్చిందనే ఆరోపణలున్నాయి.
ఇక మధ్యతరగతితో పాటు పేద వారు అప్పులు చేసి కార్పొరేట్ వైద్యం కోసం ఆశపడితే.. పైసలతో పాటు.. ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇక ఒకప్పుడు ఆసుపత్రులు అంటే ప్రాణం పోసే దేవాలయాలుగా భావించేవారు.. వైద్యులను దేవుడిగా భావించి నమస్కరించే వారు.. కానీ నేడు మానవత్వం చాటున మరమనుషులు ఉంటున్నారు. కాసుల వేటలో దోపిడికి తెగబడి కన్నుమిన్ను కానక ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు..
ఎన్ని డబ్బులు ఖర్చు చేసిన బ్రతికి బట్టకడుతామన్న ఆశలు లేకుండా కొందరు డాక్టర్లు వ్యవహరించడం వైద్యరంగానికి మాయని మచ్చగా మారుతుందనే ఆరోపణలున్నాయి.. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులైతే ప్రాణాలు తీసే మృత్యు కూపాలుగా మారుతున్నాయనే ఆరోపణలు ఎక్కువైయ్యాయి.. ఆరోగ్యం కోసం అడుగుపెడితే శవాలై బయటకు వస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి..
చివరికి వైద్యం చేయించుకునే వారు.. కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలకు కేవలం ఓ 'ఎన్రోల్మెంట్ నంబర్'గా, 'కాష్ కౌంటర్'గా మారిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒకప్పుడు వైద్యో నారాయణో హరిః అన్నది నానుడి. గతంలో ఆసుపత్రి అంటే ఒక భరోసా, వైద్యుడి చిరునవ్వు సగం రోగాన్ని నయం చేసేది. కార్పొరేట్ సంస్కృతి రాకముందు ఫీజులు కూడా అందరికీ అందుబాటులో ఉండేవి..
అర్హత కలిగిన డాక్టర్లు, రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించేవారు. అత్యవసర సమయంలో డబ్బుల కంటే ప్రాణానికే ప్రాధాన్యత లభించేది. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బిల్డింగుల వెనుక మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. చిన్నపాటి జ్వరానికి బెంబేలెత్తిస్తు అడ్మిషన్స్, అవసరం లేకపోయినా అనవసరమైన ఆపరేషన్లు, లేని రోగాలకు వేల రూపాయల టెస్టులు..
సరైన శిక్షణ లేని సిబ్బందితో ఐసీయూలు నడుపుతున్న ఘటనలు, శవానికి చికిత్స చేస్తూ లక్షల రూపాయలు గుంజుతున్న వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి రావడం కనిపిస్తుంది. బాలింతలు ప్రసవం కోసం వెళ్లి మృత్యువాత పడుతున్న తీరు, ఒకరి మందులు మరొకరికి ఇచ్చి ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం, చిన్నపాటి సమస్యలతో హాస్పిటల్లో చేరి బెడ్ పైనే ప్రాణాలు వదులుతున్న ఘోరాలు.. కార్పొరేట్ ఆస్పత్రుల పేరెత్తితేనే హడల గొడుతున్నాయి..
ఇన్ని దారుణాలు జరుగుతున్న ఆస్పత్రి యాజమాన్యాలు మాత్రం కేవలం ధనం మూలం ఇదం జగత్ అనే సిద్ధాంతాన్ని తప్పకుండా పాటించడం శోచనీయం.. మరోవైపు వైద్యాన్ని సేవ స్థానం నుంచి పూర్తిగా వ్యాపారం గా మార్చడమే ఈ దారుణాలకు మూలకారణంగా చెబుతున్నారు.. అదీగాక కార్పొరేట్ ఆస్పత్రుల్లో డాక్టర్లకు మంత్లీ టార్గెట్లు విధిస్తున్నట్టు ఆరోపణలున్నాయి..
ఇన్ని ఆపరేషన్లు చేయాలి, ఇన్ని డయాగ్నోస్టిక్స్ రాయాలి, ఇన్ని రోజులపాటు ఐసీయూలో రోగిని ఉంచాలనే ఒత్తిడి వైద్యులపై ఉంటోందని ప్రచారం జరుగుతుంది. అలాగే అనవసరంగా చేస్తున్న శస్త్రచికిత్సలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు సిండికేట్ గా ఏర్పడి.. ప్రభుత్వంలోని పెద్దలను గుప్పిట్లో పెట్టుకోవడం .. మరోవైపు అధికారులు కూడా లంచాలకుమరగడం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (Clinical Establishments Act) అమలు కాకపోవడం వంటి వాటివల్ల పేదల రక్తాలను కార్పొరేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయనే విమర్శలున్నాయి..
అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటళ్లలో కనీస ప్రమాణాలు ఉన్నాయా? డాక్టర్ల క్వాలిఫికేషన్ ఎంత? ఎంతమంది అనుభవజ్ఞులైన నర్సులు ఉన్నారు? అత్యవసర నివారణ పరికరాలు పనిచేస్తున్నాయా? అనే విషయాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసే వ్యవస్థ ప్రభుత్వాల వద్ద లోపించింది. సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కమిటీలు వేయడం, కొన్ని రోజుల పాటు ఆ హాస్పిటల్ కు సీల్ వేయడం తప్ప... శాశ్వత పరిష్కారాలు కనిపించడం లేదు.
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలగకపోవడంతో సామాన్యులు కూడా అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రుల వైపే అడుగులు వేస్తున్నారు. ఇదే ప్రైవేటు యాజమాన్యాలకు పెద్ద అస్త్రంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో రేట్ల పట్టిక, డాక్టర్ల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలనే నియమాలున్నా అవి తూతూమంత్రగా అమలవుతున్నాయనే ఆరోపణలున్నాయి..
ఇక వైద్య నిర్లక్ష్యం ఆధారాలతో నిరూపితమైతే లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, ఆధునిక పరికరాలు కల్పించి రోగులకు పూర్తి భరోసా ఇవ్వాలి. అప్పుడే కార్పొరేట్ దందాకు కొంతైనా అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి కఠిన చర్యలు తీసుకోకపోతే... ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాలు నిత్యం బాధితుల కన్నీటితో నిండిపోవడం తథ్యం అంటున్నారు..


