వివాహేతర సంబంధం ముసుగులో నేరాలు పెరిగిపోతున్నాయి. సహజీవనం చేస్తూ సంతోషంగా గడుపుతున్న జంటలు .. పెళ్లి పేరెత్తేసరికి భాగస్వామి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తున్నది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో యువతులు, మహిళలు తమ సహజీవన భాగస్వామిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే హత్యలు జరిగినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన సత్య ప్రకాష్ జటావ్ అనే వ్యక్తి ఓవైపు భార్యతో కాపురం చేస్తూ మరోవైపు నర్సింగ్ అధికారిణి స్నేహలతా పాండేతో సహజీవనం చేస్తున్నాడు.కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న సత్య ప్రకాష్, స్నేహలతకు 10 నెలల కుమారుడు ఉన్నాడు.బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి తనని పెళ్లి చేసుకొని భార్యగా అంగీకరించాలని స్నేహలత పట్టుబట్టింది.కానీ, సత్య ప్రకాష్ అందుకు ఒప్పుకోలేదు. ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మాట దాటవేస్తూ వచ్చాడు.
కొన్ని రోజుల క్రితం మరోసారి స్నేహలతా పాండే పెళ్లి ప్రస్తావన తేవడంతో మాట వినడం లేదని ఆమెను చంపేయాలని సత్యప్రకాష్ నిర్ణయం తీసుకున్నాడు. ప్లాన్లో భాగంగా తొలుత 10 నెలల కుమారుడ్ని తన మొదటి భార్య వద్ద వదిలి వచ్చిన అతడు..అక్టోబర్ 8న కాన్పూర్ చూపిస్తానని, షాకింగ్ చేయిస్తానని చెప్పి బైక్ మీద ఆమెను తీసుకెళ్లాడు. పచ్నాడ నదికి (5 నదులు కలిపే చోటు) తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశాడు.
డెడ్ బాడీని పడేసిన ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.స్నేహలత కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో ఇంతకాలం ఆమెతో సహజీవనం చేస్తున్న సత్యప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించినట్టు తెలిసింది. పెళ్లికి ఒత్తిడి చేస్తోందన్న కారణంతోనే స్నేహలతను చంపేసినట్టు సత్య ప్రకాష్ విచారణలో అంగీకరించడంతో అతన్ని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలిసింది.


