ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేలా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సూచనలు అందడంతో, ఆగస్టు 1 నుంచి ఈ ప్రత్యేక పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజుల్లోనే రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి మూడు నెలల కోటాను ఒకేసారి అందించనున్న నేపథ్యంలో ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచి ఉంచే అవకాశముంది. అయితే బయోమెట్రిక్ నమోదు కోసం లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెల రేషన్ కోసం వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో సమయం, ప్రయాణ ఖర్చు రెండూ ఆదా అవుతాయి. మరోవైపు భారీ మొత్తంలో బియ్యం ఒకేసారి పంపిణీ కావడంతో నిల్వలు, రవాణా, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాల్సిన బాధ్య అధికారులపై ఉంది.
అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి కోటా అందేలా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్ లేదా మధ్యవర్తుల జోక్యం వంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.












