Junk Food Ban: ఇటీవలి కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడిపోతున్నారు. జంక్ ఫుడ్ కారణంగా పోషకాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే జబ్బుల బారిన పడుతున్నారు. వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారుతోంది. ఈ క్రమంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కట్టడిపై కర్నాటక ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా స్కూళ్ల క్యాంటీన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో జంక్ ఫుడ్ విక్రయాలను పూర్తి బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించేందుకు ఈ దిశగా యోచన చేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు ఆసుపత్రి క్యాంటీన్లలోనూ జంక్ ఫుడ్ బ్యాన్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు మంత్రి ఖాదర్.
పాఠశాల విద్యార్థులకు బర్గర్లు, పిజ్జాలు వంటి అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. మెరుగైన ప్రమాణాలను నిర్ధారించేందుకు ఆహార భద్రతా నిబంధనలలో కీలక మార్పులు తెస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలలోని అనేక ఆరోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కారణమని మంత్రి ఖాదర్ అభిప్రాయపడ్డారు. పిల్లల ఎదుగుదలకు, సమగ్ర వికాసానికి పౌష్టికాహారం చాలా అవసరమని ఆయన తేల్చి చెప్పారు.
మంగళూరు జిల్లా ఆసుపత్రిలో మంత్రి మాట్లాడారు. ఇక్కడి నుంచి నిషేధం మొదలవ్వాలని కోరుకున్నారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. అంతేకాదు మార్కెట్ లోకి ఫుడ్ సప్లయ్ చేసే వారు నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే అని మంత్రి ఖాదర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ఆహార పరీక్షా ప్రయోగశాలలను ఆధునీకరించడం ద్వారా ఆహార భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్, మానిటరింగ్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, పిల్లలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రతిపాదిత చర్య ఉంది. విధానపరమైన ముసాయిదా ఖరారైన తర్వాత ఈ నిషేధం అమలు, దానిని అమలు చేసే చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తారు.
ఈ తరం పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారానికి దూరమవుతున్నారనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యం పాలిట పెద్ద ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ క్యాంటీన్లు, వాటి పరిసరాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను బ్యాన్ చేయాలనే కర్నాటక ప్రభుత్వం యోచనను అందరూ స్వాగతిస్తున్నారు.












