ఏపీ

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం.. భక్తులకు తృటిలో తప్పిన ముప్పు!

రచన: Venu4 నిమిషాల పఠనం

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు ప్రయాణిస్తున్న కారు, రెండో ఘాట్‌ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో అదుపుతప్పింది.

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు ప్రయాణిస్తున్న కారు, రెండో ఘాట్‌ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో అదుపుతప్పింది. రక్షణ గోడను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఐదుగురు భక్తులు స్వల్ప గాయాలతోనే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు ఘాట్‌ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అయితే ఈ ఘటన ఒక్కటే కాదు. తిరుమల ఘాట్‌ రోడ్లపై గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించకపోవడం, డ్రైవర్లు అలసటతో వాహనాలు నడపడం, బ్రేక్ వ్యవస్థలో లోపాలు, వర్షాకాలంలో రోడ్డు జారుడుగా మారడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

కొన్నిసార్లు అతివేగం, మరికొన్నిసార్లు నిర్లక్ష్య డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు దారితీసింది. తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలామంది రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున ఘాట్‌ రోడ్డెక్కుతుంటారు. అలాంటి సమయంలో డ్రైవర్‌కు నిద్రమత్తు ఉంటే ప్రమాదం సంభవించే అవకాశం మరింత పెరుగుతుంది. అలాగే ఘాట్‌ రోడ్లలో వరుసగా ఎత్తైన మలుపులు, దిగువ వంపులు ఉండటంతో సాధారణ రహదారుల మాదిరిగా వాహనం నడపడం ప్రమాదకరం.

అందుకే టీటీడీ అధికారులు, పోలీసులు తరచూ వేగ పరిమితులను పాటించాలని, వాహనాల కండిషన్ ను ముందుగానే పరిశీలించాలని, అలసటగా ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికగా భావించాలి. తిరుమల ఘాట్‌ రోడ్లలో ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే వేగం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షితంగా స్వామివారి దర్శనానికి చేరుకోవచ్చు..

#AP#chittoor#Tirumala Ghat Road#car Accident#second ghat#Devotees
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి