రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఓ విద్యార్థుల హాస్టల్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.. సాధారణంగా హాస్టల్ మెస్‌లో విద్యార్థులు భోజనం కోసం క్యూలో నిలబడటం చూస్తాం. కానీ ఈసారి మాత్రం మెస్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చింది.. దీంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు.
రాజస్థాన్, కోటాలోని బోరాఖేడా ప్రాంతంలో ఉన్న బాలుర హాస్టల్ బేస్‌మెంట్‌లోని మెస్‌లోకి అకస్మాత్తుగా ఓ మొసలి ప్రవేశించడంతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో విద్యార్థుల కోసం భోజనం సిద్ధం చేస్తున్న వంటమనిషి మొసలిని గమనించి బయటకు పరుగెత్తి అందరినీ అప్రమత్తం చేశాడు. మొసలిని చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ మెస్ నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎంతో జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెస్‌లో ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ఆకస్మికంగా వచ్చిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లా మొసలి కనిపించిందని.. మరికొందరు విద్యార్థుల కంటే మొసలికే ముందుగా భోజనం కావాలనిపించింది అనుకుంటా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఈ ఘటన వెనుక కారణం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కోటా నగరం మగ్గర్ జాతి మొసళ్లకు ప్రసిద్ధి చెందిన చంబల్ నది పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, వర్షాకాలంలో లేదా నీటి మట్టంలో హెచ్చు తగ్గులు ఏర్పడిన సందర్భాల్లో మొసళ్లు జనావాసాల్లోకి రావడం కొత్త విషయం కాదని అంటున్నారు.
ముఖ్యంగా నదికి సమీపంలో ఉన్న హాస్టళ్లు, కాలనీలు, భవనాల్లోకి ఇలాంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు ప్రవేశించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలు మరింత అప్రమత్తంగా ఉండి, భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.












