మోసం చేసేవాడికి మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది. ఎందుకంటే మోసగాళ్ళు రోజుకో కొత్త అవతారంలో చీటింగ్ చేస్తూ.. తమ పబ్బం గడుపుకుంటున్నారు. తాజాగా రేషన్ బియ్యం అమ్మడంలో రిస్క్ ఉండటంతో కొత్త తరహా మోసానికి తెరతీశారు.. ఈ క్రమంలో రూ.1,300 విలువైన 25 కేజీల సాంబ మసూరి బియ్యం బ్యాగు కేవలం రూ.600లకే ఇస్తాం.. లారీ బ్రేక్‌డౌన్ అవ్వడంతో తక్కువ ధరకు అమ్మేస్తున్నాం అంటూ గ్రామాల్లోకి వచ్చి ప్రజలను నమ్మిస్తున్న ముఠా గుట్టు రట్టయింది..
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి, బ్రాండెడ్ బియ్యంగా నమ్మిస్తూ ఖమ్మం జిల్లాలో కొందరు అక్రమార్కులు సరికొత్త మోసానికి తెరలేపారు. ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాంతంతో పాటు సమీప మండలాల్లో ఈ తరహా దందా జోరుగా సాగుతోంది. గ్రామాల్లోకి ప్రైవేట్ వాహనాల్లో వచ్చే దళారులు.. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన బియ్యం లోడ్ ఇక్కడే నిలిచిపోయిందని కథలు అల్లుతున్నారు.
మార్కెట్‌లో రూ.1200 నుంచి రూ.1300 వరకు పలికే ప్రీమియం క్వాలిటీ రైస్ బ్యాగును రూ.600లకే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. తీరా దళారులు వెళ్లాక సంచులను విప్పి చూస్తే.. లోపల సాంబ మసూరి కాస్తా, పాలిష్ పట్టిన నాసిరకం రేషన్ బియ్యంగా తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. గతంలో లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.15కు కొనుగోలు చేసిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు తరలించి, అక్కడ రీ-సైక్లింగ్ చేసి బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేసేవారు.
వాటిని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు, అలాగే పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు లారీలు, రైళ్లలో తరలించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల సరిహద్దుల వద్ద పోలీసులు, పౌరసరఫరాల శాఖ తనిఖీలు తీవ్రం చేయడంతో అక్రమార్కులు రూటు మార్చారు. చెక్‌పోస్టులు దాటే రిస్క్ లేకుండా నేరుగా గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త 'బ్రేక్‌డౌన్' మోసానికి శ్రీకారం చుట్టారు.
ఈ దందాపై స్పందించిన పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. పాలిష్ పట్టిన రేషన్ బియ్యాన్ని సాంబ మసూరి అని నమ్మి ఎవరూ కొనుగోలు చేయవద్దని సివిల్ సప్లైస్ డీటీ కిరణ్ కుమార్ హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొన్నా, అమ్మినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాల్లోకి వచ్చి తక్కువ ధరకే బియ్యం అంటూ అమ్మే అనుమానాస్పద వ్యక్తులను చూస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.







